Hyderabad: రెట్టింపు కట్నం ఇస్తేనే పెళ్లాడతానంటూ మండపం నుంచి ఉడాయించిన పెళ్లికొడుకు

  • హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్‌లో ఘటన
  • బంధువులు నచ్చజెప్పినా వినని పెళ్లి కొడుకు
  • ఆగిన పీటల మీద పెళ్లి

ముందుగా మాట్లాడుకున్న కట్నానికి రెట్టింపు కట్నం ఇస్తేనే పెళ్లాడతానని డిమాండ్ చేసిన పెళ్లికొడుకు మండపం నుంచి ఉడాయించాడు. దీంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. పాతబస్తీకి చెందిన మసీవుద్దీన్ (30)కు జల్‌పల్లికి చెందిన యువతి (26)తో వివాహం నిశ్చయమైంది. ఈ సందర్భంగా ఐదు లక్షల రూపాయల కట్నం, ఇతర వస్తువులు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది

ఆదివారం పెళ్లి జరగాల్సి ఉండగా, ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు పెళ్లి మండపానికి చేరుకున్నారు. మరికాసేపట్లో పెళ్లి తంతు ప్రారంభం కానుండగా తనకు రెట్టింపు కట్నం కావాలంటూ వరుడు మొండిపట్టు పట్టాడు. ఇస్తేనే పెళ్లి జరుగుతుందని తేల్చి చెప్పాడు. బంధువులు నచ్చజెప్పినా వినకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో పెళ్లి ఆగిపోయింది. సోమవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బాలాపూర్ పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

More Telugu News