Hameed Ansari: మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీపై 'రా' మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు

  • టెహ్రాన్ లో నేను ఉన్న సమయంలో రాయబారిగా అన్సారీ ఉన్నారు
  • 'రా' కార్యకలాపాలను బహిర్గతం చేశారు
  • అలాంటి వ్యక్తికి రెండు సార్లు ఉప రాష్ట్రపతిగా అవకాశం కల్పించారు

మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీపై దేశ అత్యున్నత గూఢచార సంస్థ 'రా' మాజీ అధికారి ఎన్.కే.సూద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ లో భారత రాయబారిగా హమీద్ అన్సారీ పని చేస్తున్నప్పుడు... టెహ్రాన్ లోని 'రా' కార్యకలాపాలను బహిర్గతం చేశారని... తద్వారా అక్కడి యూనిట్ లో పనిచేస్తున్న ఉద్యోగుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టారని ఆరోపించారు. 'రా' అధికారిగా తాను టెహ్రాన్ లో ఉన్న సమయంలో... ఇరాన్ లో భారత రాయబారిగా అన్సారీ ఉన్నారని తెలిపారు. అలాంటి వ్యక్తికి రెండు సార్లు భారత ఉప రాష్ట్రపతిగా పనిచేసే అవకాశాన్ని కల్పించారని ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు.

ఇదే విషయాన్ని తాను అప్పటి ప్రతిపక్ష నేత వాజ్ పేయి దృష్టికి తీసుకెళ్లానని... అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుతో వాజ్ పేయి మాట్లాడారని... కానీ, ఎలాంటి  చర్యలు తీసుకోలేదని సూద్ తెలిపారు. టెహ్రాన్ లో అన్సారీ రాయబారిగా ఉన్నప్పుడు... ఇండియన్ ఎంబసీకి చెందిన ఐదుగురు ఉద్యోగులను ఇరానియన్ ఇంటెలిజెన్స్ అధికారులు కిడ్నాప్ చేశారని... అయితే వారిని విడుదల చేయించేందుకు అన్సారీ ఎలాంటి ప్రయత్నం చేయలేదని విమర్శించారు. చరిత్రలో తొలిసారి టెహ్రాన్ లో అన్సారీకి వ్యతిరేకంగా ఎంబసీ అధికారుల భార్యలు నిరసన చేపట్టారని తెలిపారు.

సూద్ ట్వీట్ పై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. అన్సారీ ఒక కమ్యూనిస్టు అని... యూపీఏ ప్రభుత్వం ఆయనను వెనకేసుకొచ్చిందని ట్వీట్ చేశారు.

1961లో ఇండియన్ ఫారిన్ సర్వీస్ కు అన్సారీ ఎంపికయ్యారు. ఇరాక్, మొరాకో, బెల్జియం, సౌదీ అరేబియా దేశాల్లో పని చేశారు. యూఏఈ, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, సౌదీ అరేబియాల్లో భారత రాయబారిగా సేవలందించారు.


  • Loading...

More Telugu News