Japan: జపాన్ ఉత్పత్తులను బహిష్కరించండి.. ఉద్యమిస్తున్న దక్షిణకొరియా ప్రజలు!

  • జపాన్ కంపెనీల ఆస్తులను జప్తు చేసిన కొరియా కోర్టు
  • అరుదైన లోహాలను అమ్మరాదని నిర్ణయించిన జపాన్
  • జపాన్ చర్యకు ప్రతీకారంగా ఉద్యమిస్తున్న కొరియన్లు

జపాన్, దక్షిణకొరియాల మధ్య ప్రస్తుతం పరిస్థితి ఉప్పు-నిప్పులా తయారయింది. దక్షిణకొరియన్లు ఇప్పుడు జపాన్ ఉత్పత్తులను బహిష్కరించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. జపాన్ ఉత్పత్తులకు బదులుగా స్వదేశీ కంపెనీల ఉత్పత్తులను వాడాలని సాటి పౌరులకు పిలుపునిస్తున్నారు. అలాగే జపాన్ కు వెళ్లేబదులుగా ఇతర దేశాలను సందర్శించాలని తమ టూరిస్టులను కోరుతున్నారు. దక్షిణకొరియాలోని ఓ న్యాయస్థానం తీర్పు, జపాన్ ప్రధాని షింజో అబే తాజాగా తీసుకున్న నిర్ణయం ఈ వివాదానికి కారణమైంది.

1910-45 మధ్యకాలంలో జపాన్ ఆక్రమణలో కొరియా ఉన్నప్పుడు బలవంతంగా వెట్టిచాకిరి చేయించారని ఓ కేసు నమోదైంది. దీన్ని విచారించిన కొరియా కోర్టు ఆ సమయంలో కొరియన్లు పనిచేసిన కంపెనీల ఆస్తులను తాజాగా జప్తు చేసింది. దీనిపై జపాన్ సీరియస్ అయింది. అత్యాధునిక చిప్ లు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు సహా హైఎండ్ టెక్నాలజీ  కోసం అవసరమైన లోహాలను దక్షిణకొరియాకు అమ్మకూడదని షింజో అబే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల కొరియాలోని ఎలక్ట్రానిక్ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడనుంది.

ఈ నేపథ్యంలోనే జపాన్ చర్యకు ప్రతీకారంగా ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరించాలని కొరియన్లు, ఇన్ స్టాగ్రామ్ తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై ఉద్యమిస్తున్నారు. గతేడాది జపాన్-దక్షిణకొరియాల మధ్య రూ.3.67 లక్షల కోట్ల వాణిజ్యం జరిగింది. జపాన్ నుంచి వస్తువులను అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న మూడో దేశం దక్షిణకొరియానే. మరోవైపు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భావనతో కొరియన్ షాపింగ్ మాల్స్ కూడా జపాన్ ఉత్పత్తులను అమ్మడం ఆపేశాయి.

More Telugu News