Rafale: రాఫెల్ విమానాల రాక పట్ల సంతోషిస్తున్నా, పావురాళ్లతో ఎలాగబ్బా అని తలపట్టుకుంటున్న భారత వాయుసేన!

  • ఇటీవలే జాగ్వార్ విమానంలో దూరిన పావురం
  • అతికష్టమ్మీద విమానం ల్యాండింగ్
  • 2020 నాటికి అంబాలా ఎయిర్ బేస్ లో రాఫెల్ జెట్ ఫైటర్లు

గాల్లో ప్రయాణించే విమానాలకు ప్రబల శత్రువులు పక్షులే. ఓ చిన్న పక్షి విమానం ఇంజిన్ లో దూరినా సరే విధ్వంసం భారీస్థాయిలో ఉంటుంది. ఒక్కోసారి ఆ విమానం కుప్పకూలే ప్రమాదం ఉంటుంది. అందుకే విమానాశ్రయ పరిసరాల్లో పక్షులను పారదోలేందుకు ప్రత్యేక వ్యవస్థలు ఉంటాయి. ఎన్ని ఏర్పాట్లు ఉన్నా పక్షులను పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాదు. ఇప్పుడీ అంశమే భారత వాయుసేన అధికారులను కలవరపెడుతోంది.

ఎందుకంటే, హర్యానాలో ఉన్న అంబాలా ఎయిర్ బేస్ చుట్టూ పెద్ద సంఖ్యలో పావురాలు విహరిస్తుంటాయి. ఆ పావురాలు తమ విమానాలకు ఎక్కడ ముప్పుగా పరిణమిస్తాయోనని వాయుసేన అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఇక్కడికి రాఫెల్ యుద్ధవిమానాలు రానున్నాయి. కొన్ని వేల కోట్ల విలువైన ఆ యుద్ధ విమానాలకు పావురాళ్లు ఎక్కడ ప్రమాదకరంగా పరిణమిస్తాయోనని అంబాలా ఎయిర్ బేస్ అధికారులు తలపట్టుకుంటున్నారు.

భారత వాయుసేన ఫ్రెంచ్ తయారీ రాఫెల్ యుద్ధ విమానాలకు అంబాలా ఎయిర్ బేస్ ను ప్రధాన స్థావరంగా నిర్ణయించింది. 2020 నాటికి రాఫెల్ యుద్ధవిమానాలు రానున్న నేపథ్యంలో, అప్పటిలోగా పావురాళ్ల పనిబట్టాలని వాయుసేన సిబ్బందికి పైఅధికారులు ఆదేశాలిచ్చారు. ముఖ్యంగా, పావురాళ్ల పెంపకందారులపై కఠిన ఆంక్షలు విధించాలని భావిస్తున్నారు.

కిందటివారమే అంబాలా ఎయిర్ బేస్ కు చెందిన జాగ్వార్ విమానం గాల్లో విహరిస్తుండగా, ఓ పావురం ఇంజిన్ లోకి వెళ్లడంతో ఆ ఇంజిన్ మొరాయించింది. దాంతో, సింగిల్ ఇంజిన్ తో నెట్టుకొచ్చిన ఆ విమాన సిబ్బంది సురక్షితమైన ల్యాండింగ్ కోసం విమానం ఫ్యూయల్ టాంక్ తో పాటు, కొన్ని డమ్మీ బాంబులను కిందికి జారవిడిచారు. ఆపై అత్యంత శ్రమపడి విమానాన్ని ప్రమాదంలేకుండా కిందికి దించారు. ఇలాంటి అనుభవాలు గతంలో కూడా ఎన్నో ఉన్నాయి. అయితే, రాఫెల్ విమానాలు ఎంతో ఖరీదైనవి కావడంతో వాయుసేన అధికారులు పావురాల పట్ల కఠినచర్యలకు ఉపక్రమించారు.

More Telugu News