Rohit Sharma: జూలై 14న కప్ గెలవకపోతే ఎన్ని సెంచరీలు చేసి ఏంప్రయోజనం!: రోహిత్ శర్మ

  • రికార్డుల కంటే జట్టు విజయమే ముఖ్యం
  • టీమిండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు రికార్డుల పట్ల సంతోషిస్తా
  • మైదానంలోకి దిగేది రికార్డుల కోసం కాదు

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ప్రస్తుతం భీకర ఫామ్ లో కొనసాగుతున్నాడు. టోర్నీలో ఐదు సెంచరీలు చేసి ప్రపంచకప్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించాడు. వరల్డ్ కప్ లో అత్యధిక పరుగుల వీరుడు కూడా రోహిత్ శర్మే. అయితే, శ్రీలంకతో మ్యాచ్ విజయం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు సెంచరీల కంటే జట్టు విజయమే ముఖ్యమని స్పష్టం చేశాడు. జూలై 14న లార్డ్స్ మైదానంలో వరల్డ్ కప్ ట్రోఫీని అందుకోకపోతే ఎన్ని సెంచరీలు, ఎన్ని పరుగులు చేసి ఏంలాభం! అంటూ వ్యాఖ్యానించాడు.

ఈ ప్రపంచకప్ ను టీమిండియా గెలిచినప్పుడే తాను సాధించిన ఘనతల పట్ల సంతోషపడతానని చెప్పాడు. నాలుగేళ్లకు ఓసారి వచ్చే వరల్డ్ కప్ పైనే తమ దృష్టంతా కేంద్రీకృతమై ఉందని, ఇప్పుడు ప్రతి ఆటగాడు సెమీఫైనల్, ఫైనల్ పైనే మనసు లగ్నం చేశారని వివరించాడు. తాను మైదానంలోకి దిగేది క్రికెట్ ఆడేందుకేనని, రికార్డుల కోసంకాదని ఈ ముంబైవాలా పేర్కొన్నాడు.

More Telugu News