​శ్రీలంకపై భారత్ విక్టరీ... సెమీస్ లో న్యూజిలాండ్ తో ఆడే చాన్స్!​

06-07-2019 Sat 22:38
  • 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయం
  • రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ సెంచరీలు
  • పాయింట్ల పట్టికలో భారత్ నంబర్ వన్
శ్రీలంకతో హెడింగ్లే మైదానంలో జరిగిన వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా ఘనవిజయం సాధించింది. లంక విసిరిన 265 పరుగుల లక్ష్యాన్ని భారత్ 43.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇద్దరూ సెంచరీలు సాధించడం విశేషం. ఓ వరల్డ్ కప్ లో ఇద్దరు భారత ఓపెనర్లు ఒకే మ్యాచ్ లో సెంచరీలు నమోదు చేయడం ఇదే ప్రథమం. రోహిత్, రాహల్, పంత్ అవుటైనా, హార్దిక్ తో కలిసి కోహ్లీ జట్టును విజయతీరాలకు చేర్చాడు.

కాగా, ఈ విజయంతో టీమిండియా ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మొత్తం లీగ్ మ్యాచ్ లన్నీ పూర్తికాగా భారత్ 9 మ్యాచ్ ల్లో 15 పాయింట్లతో నంబర్ వన్ ప్లేసులో ఉంది. కోహ్లీసేన ఖాతాలో 7 విజయాలు, ఒక ఓటమి ఉన్నాయి. ఈ నేపథ్యంలో, టీమిండియా సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే, దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో ఆసీస్ ముందు భారీ లక్ష్యం ఉంది. గెలవడం కొంచెం కష్టమైన పనే.

ప్రస్తుతం ఆసీస్ ఖాతాలో 14 పాయింట్లున్నాయి. ఆసీస్ ఈ మ్యాచ్ లో ఓడిపోతే పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉంటుంది. అప్పుడు అగ్రస్థానంలో ఉన్న భారత్ కు, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ సెమీస్ ప్రత్యర్థి అవుతుంది. అదే జరిగితే, రెండు, మూడు స్థానాల్లో ఉండే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మరో సెమీఫైనల్లో తలపడతాయి.