Andhra Pradesh: చంద్రబాబు ఇప్పుడు నీతి బోధలు చేస్తున్నారు! : మంత్రి బొత్స ఫైర్

  • గత ఐదేళ్లలో పేదల ఇళ్ల పథకం ఓ కుంభకోణం  
  • పేదవాడి కడుపుకొట్టి స్కాంలకు పాల్పడ్డారు
  • కొత్త టెక్నాలజీ పేరిట అధిక ధరలకు కాంట్రాక్టులు ఇచ్చారు

ఏపీలో గత ఐదేళ్లలో పేదల ఇళ్ల పథకం ఓ కుంభకోణం పథకంలా మారిందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పేదవాడి కడుపుకొట్టి స్కాంలకు పాల్పడి, మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు ఇప్పుడు నీతి బోధలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

గత ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న సీఎం జగన్ వ్యాఖ్యలను కక్షపూరితమంటూ ఎదురుదాడి చేస్తున్నారని టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. కొత్త టెక్నాలజీ పేరు చెప్పి అధిక ధరలకు కాంట్రాక్టులు కేటాయించారని ఆరోపించారు. పేదవాళ్లకు ఎన్ని ఇళ్లు కేటాయించారు? కనీసం ఒక్కటైనా అప్పగించారా? అని ప్రశ్నించిన బొత్స, ఇది రాజకీయ ఉపన్యాసం కాదని, వాస్తవాలు చెబుతున్నామని అన్నారు. వైఎస్ హయాంలో ఇరవై ఐదు లక్షల ఇళ్లు కడితే, తామే కట్టినట్టుగా టీడీపీ నేతలు చెబుతున్నారని, వైఎస్ హయాంలో ఉచితంగా జీ-ప్లస్ ఇల్లు కేటాయించామని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్నదే సీఎం జగన్ ఉద్దేశమని అన్నారు. ఎక్కడా పైసా వసూలు చేయకుండా అర్హులందరికీ ఇళ్లు కేటాయిస్తామని మరోసారి స్పష్టం చేశారు. 

More Telugu News