Andhra Pradesh: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణకు టీడీపీ నేతలు హాజరుకాకపోవడం విచారకరం!: ఆళ్ల రామకృష్ణారెడ్డి

  • గైర్హాజరు కావడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం
  • ఈసారి అసెంబ్లీలో 50 శాతం మంది కొత్తవారే
  • అజయ్ కల్లం, ఐవైఆర్ తో తరగతులు నిర్వహిస్తున్నాం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికైనవారిలో ఈసారి 50 శాతం కంటే ఎక్కువ మంది కొత్తవారేనని వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఐఏఎస్ అధికారులు అజయ్ కల్లం, ఐవైఆర్ కృష్ణారావు సహా చాలామంది నిపుణులతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ శిక్షణా కార్యక్రమానికి పాలకపక్షం, ప్రతిపక్షం అన్న తేడా లేదనీ, ప్రతీఒక్కరూ హాజరుకావొచ్చని వ్యాఖ్యానించారు.

ఈ శిక్షణా కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాకపోవడం విచారకరమైన విషయమని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. శిక్షణ కార్యక్రమానికి రాకపోవడాన్ని టీడీపీ నేతల విజ్ఞతకే వదిలేస్తున్నామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో చంద్రబాబు మైక్ కోరగానే సీఎం జగన్ కూర్చున్నారనీ, సబ్జెక్ట్ తెలుసుకుని అసెంబ్లీకి రావాల్సిందిగా ఎమ్మెల్యేలకు సీఎం జగన్ సూచించారని ఆర్కే గుర్తుచేశారు. అమరావతిలోని అసెంబ్లీ హాలులో నిన్నటి నుంచి జరుగుతున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల శిక్షణా తరగతులు నేడు ముగియనున్నాయి.

More Telugu News