Andhra Pradesh: అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు!

  • ప్రపంచకప్ కు రాయుడిని ఎంపిక చేయని బోర్డు
  • తాజాగా ఒక్క వన్డే కూడా ఆడని మయాంక్ కు ఛాన్స్
  • మనస్తాపంతో క్రికెట్ కు గుడ్ బై చెప్పిన అంబటి

ప్రముఖ తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఇంగ్లాండ్ లో జరుగుతున్న ప్రపంచకప్ టోర్నీకి తనను ఎంపిక చేయకుండా మయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేయడం, తనను త్రీడీ ఆటగాడిగా అభివర్ణించడంపై మనస్తాపం చెందిన అంబటి రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తనను కాకుండా విజయ్ శంకర్ అనే ఆటగాడిని టోర్నీకి ఎంపిక చేయడంతో ‘ఈ ప్రపంచకప్ చూసేందుకు త్రీడీ కళ్లద్దాలు కొన్నా’ అని రాయుడు వ్యాఖ్యానించాడు.

దీంతో ఈ కామెంట్లను బీసీసీఐ సీరియస్ గా తీసుకుంది. తాజాగా విజయశంకర్ గాయపడగా, ఫామ్ లో ఉన్న అంబటి రాయుడిని కాకుండా ఒక్క వన్డే కూడా ఆడని మయాంక్ అగర్వాల్ ను ఇంగ్లాండ్ కు రప్పించారు. ఈ సందర్భంగా బీసీసీఐ పెద్దలు స్పందిస్తూ.. రాయుడు త్రీడీ ప్లేయర్ అనీ, అందుకే అతడిని జట్టులోకి ఎంపిక చేయలేదని పరోక్షంగా విమర్శించారు. దీంతో రాయుడు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులకు రాయుడు 1985, సెప్టెంబర్ 23న జన్మించాడు. 2001-02లో రంజీ టోర్నీలో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2005-06 రంజీ సీజన్ లో ఏపీ తరఫున ఆడాడు. 2003-04 అండర్ 19 ప్రపంచకప్ లో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. 2015 ప్రపంచకప్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇప్పటివరకూ 55 వన్డేలు ఆడిన రాయుడు 47.06 సగటుతో 1694 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధికంగా 124 స్కోర్ నమోదుచేశాడు. ఇక ఐపీఎల్ లో 147 మ్యాచ్ లు ఆడిన రాయుడు 3,300 పరుగులు చేశాడు.

More Telugu News