Anantapur District: తమను అమ్మలా చూసుకున్న ఆ ప్రిన్సిపాల్ వెళ్లిపోతుంటే ఏడవని వాళ్లంటూ లేరు!

  • అనంతపురం జిల్లా నసనకోట గురుకులంలో భావోద్వేగ వాతావరణం
  • బదిలీపై వెళ్లిపోతున్న ప్రిన్సిపాల్ సంగీత కుమారి
  • కన్నీరు పెట్టిన విద్యార్థినులు, సిబ్బంది

మన సమాజంలో విద్య నేర్పే గురువుకు ఎంతటి ప్రముఖస్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నిచోట్ల గురువులు తమ పరిమితులు దాటి మరీ విద్యార్థులతో ఆత్మీయ అనుబంధాన్ని కలిగి ఉంటారు. అలాంటి గురువులు వెళ్లిపోతుంటే ఎవరికి బాధ ఉండదు చెప్పండి! అనంతపురం జిల్లా రామగిరి మండలం నసనకోట ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ సంగీత కుమారి బదిలీపై వెళ్లి పోతుంటే స్కూలంతా కన్నీరుపెట్టింది. విద్యార్థినులే కాదు, అక్కడి సిబ్బంది సైతం భోరున విలపించారు.

అది మామూలు భావోద్వేగం కాదు. పిల్లల నుంచి తల్లి దూరంగా వెళ్లిపోతుంటే గుండెల్లోంచి పొంగిపొర్లే కన్నీటిబాధ! మీరు వెళ్లొద్దు మేడం అంటూ ఆ పిల్లలు ఎలాగో గొంతు పెగల్చుకుని మాట్లాడగలిగారు కానీ, అక్కడి చిన్నారులతో తన బంధం ఎంతగా పెనవేసుకుపోయిందో అర్థమైన ఆ ప్రిన్సిపాల్ ఒక్క మాట కూడా మాట్లాడలేక కన్నీటిసుడుల మధ్య చిక్కుకుపోయింది. విద్యార్థినుల సంగతి అటుంచితే, ఆ గురుకులంలోని నాల్గో తరగతి ఉద్యోగులు సైతం ప్రిన్సిపాల్ సంగీతకుమారి వెళ్లిపోతుంటే కన్నీటిపర్యంతమయ్యారు. తమ కుటుంబసభ్యురాలే వెళ్లిపోతోందన్నంత ఇదిగా బాధపడ్డారు.

సంగీత కుమారి కోసం ఓ స్కూలు మొత్తం కన్నీరుపెట్టడం వెనుక బలమైన కారణమే ఉంది. ఓ మామూలు పాఠశాలగా ఉన్న ఆ గురుకులాన్ని సంగీతకుమారి కొద్దికాలంలోనే కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేశారు. ప్రతి ఒక్కరితో మానవీయ కోణంలో వ్యవహరించడం ఆమెను వారికి బాగా దగ్గర చేసింది. తమను అమ్మలా చూసుకునేవారని, ఆమెను బదిలీ చేయొద్దంటూ అధికారులను కోరతామని అక్కడి విద్యార్థినులు చెబుతున్నారు.

More Telugu News