Vijay Shankar: అడుగుతీసి అడుగేయలేకపోతున్న విజయ్ శంకర్ డ్రింక్స్ తో మైదానంలోకి ఎలా వచ్చాడు?: మురళీకార్తీక్

  • విజయ్ శంకర్ గాయంపై అనుమానాలు
  • మయాంక్ అగర్వాల్ తో విజయ్ శంకర్ స్థానం భర్తీ
  • ట్వీట్ చేసిన మురళీ కార్తీక్

ప్రపంచకప్ లో ఆడుతున్న టీమిండియాలోకి తమిళనాడు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ఎంపిక ఓ ఆశ్చర్యకర పరిణామం. పైగా విజయ్ శంకర్ ను నం.4 స్థానంలో ఆడిస్తామని జట్టు మేనేజ్ మెంట్ చెప్పడం పట్ల చాలామంది పెదవివిరిచారు. దానికి తగ్గట్టుగానే అతడి ప్రదర్శన సాగింది. దాంతో ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు విజయ్ శంకర్ ను పక్కనబెట్టి రిషబ్ పంత్ ను జట్టులోకి తెచ్చారు. అయితే, ఉన్నట్టుండి విజయ్ శంకర్ కు గాయం అయిందని, అతడ్ని స్వదేశానికి పంపుతున్నామని టీమిండియా మేనేజ్ మెంట్ చెప్పడం, దాన్ని బీసీసీఐ కన్ఫామ్ చేయడం చాలామందిలో సందేహాలు రేకెత్తించింది. విజయ్ శంకర్ స్థానంలో మయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేసి హుటాహుటీన అతడ్ని జట్టుతో కలవాలంటూ ఆదేశించారు.

దీనిపై టీమిండియా మాజీ ఆటగాడు మురళీ కార్తీక్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. "ఇంగ్లాండ్ తో మ్యాచ్ సందర్భంగా విజయ్ శంకర్ డ్రింక్స్ తో మైదానంలో అడుగుపెట్టిన సమయంలో ఎలాంటి ఇబ్బందిలేకుండా నడిచాడు, అలాంటి ఆటగాడ్ని గాయంతో బాధపడుతున్నాడంటూ ఎలా తప్పించారు? గాయంతో అడుగుతీసి అడుగేయలేకపోతున్నాడన్న కారణంతోనే విజయ్ శంకర్ ను తప్పించినప్పుడు, అతడితో డ్రింక్స్ ఎలా తెప్పించుకున్నారు? ఈ సందేహం నా ఒక్కడికేనా, లేక ఇంకెవ్వరికైనా వచ్చిందా?" అంటూ మురళీకార్తీక్ ట్వీట్ చేశాడు.

కాగా, నెటిజన్లు సైతం విజయ్ శంకర్ ను తప్పించిన విషయంలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కుట్రపూరితంగానే విజయ్ శంకర్ ను గాయం పేరుతో స్వదేశానికి తిప్పిపంపారని సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News