Jagan: జగన్ గ్రీన్ సిగ్నల్ కోసమే... వేచిచూస్తున్న టీడీపీ నేతలు!

  • మరో ఐదేళ్లు అధికారంలో వైకాపా
  • త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు
  • పార్టీ మారితే మేలని భావిస్తున్న లోకల్ క్యాడర్
  • ఇంకా వైఎస్ జగన్ నుంచి రాని అనుమతి

మరో ఐదు సంవత్సరాల పాటు తమ పనులను చేసుకోవాలంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం మినహా మరో మార్గం కనిపించని పరిస్థితి ఇతర పార్టీల వారికి కనిపిస్తోంది. అయితే, వైసీపీ అధినేత మాత్రం ఇంకా చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మరోవైపు స్థానిక ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి. ఇదే ఇప్పుడు టీడీపీలో ద్వితీయ శ్రేణి నాయకుల మనసులను తొలిచేస్తోంది. స్థానిక ఎన్నికలు వచ్చేలోగా, వైసీపీలో చేరాలని ఎంతో మంది నేతలు ప్లాన్ చేసుకుంటుంటే, వారికి జగన్ నుంచి అనుమతులు మాత్రం రావడం లేదు. తమ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదాకా ఆగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు చెబుతుండటంతో ఏం చేయాలో అర్థంగాని స్థితిలో వలస నేతలు ఉన్నారు.

ఇప్పటికే వైసీపీలో కొనసాగుతున్న స్థానిక నేతలతో టచ్ లో ఉన్న తెలుగుదేశం లోకల్ క్యాడర్, వలస వచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, వారిని ఆహ్వానించేందుకు మాత్రం వైసీపీ సిద్ధంగా లేదు. మరో రెండు రోజుల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక సంఘాల పదవీ కాలం ముగియనుండటంతో వేలాది మంది రాజకీయ నిరుద్యోగులుగా మారనున్నారు.

రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. ఈ సమయంలో వైసీపీలో చేరితేనే తమకు లబ్ది కలుగుతుందన్నది టీడీపీ నేతల అంచనా. ఆ పార్టీలో చేరేందుకు పైరవీలు సాగిస్తూ, ముఖ్య నేతలతో మాట్లాడుతూ, ఎప్పుడంటే అప్పుడు ఫిరాయించేందుకు సిద్ధమని అంటున్నా, వైసీపీ మాత్రం ఇంకా సై అనడం లేదు. ఇక ఎన్నికల సమయంలో తటస్థంగా ఉన్న నేతలు సైతం ఇప్పుడు వైసీపీ వైపే చూస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ జంప్ జిలానీలకు జగన్ ఎప్పుడు అవకాశం ఇస్తారో రాజకీయ విశ్లేషకులకే అంతు చిక్కడం లేదు.

More Telugu News