Vijay Shankar: పాపం... విజయ్ శంకర్! గాయంతో ప్రపంచకప్ నుంచి అవుట్

  • బుమ్రా బౌలింగ్ లో గాయం
  • విజయ్ శంకర్ స్థానంలో మయాంక్ అగర్వాల్!
  • నం.4 స్థానంలో కేఎల్ రాహుల్

ఎన్నో ఆశలతో ప్రపంచకప్ లో అడుగుపెట్టిన తమిళనాడు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ టోర్నీ నుంచి అర్థంతరంగా తప్పుకోవాల్సి వస్తోంది! తన ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో విజయ్ శంకర్ అనూహ్యంగా గాయపడ్డాడు. ప్రాక్టీసు సందర్భంగా బుమ్రా విసిరిన బంతి విజయ్ శంకర్ కాలి బొటనవేలికి తగలడంతో బాధతో విలవిల్లాడిపోయాడు. గాయం తీవ్రత ఎక్కువగానే ఉండడంతో అతడ్ని స్వదేశానికి పంపించేయాలని టీమిండియా మేనేజ్ మెంట్ నిర్ణయించింది.

కొన్నిరోజుల క్రితం కూడా బుమ్రా బౌలింగ్ లో సరిగ్గా ఇలాగే గాయపడినా, వెంటనే కోలుకున్నాడు. కానీ ఈసారి గాయం బలమైనది కావడంతో అతడ్ని జట్టు నుంచి తప్పించారు. విజయ్ శంకర్ స్థానాన్ని కర్ణాటక బ్యాట్స్ మన్ మయాంక్ అగర్వాల్ భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమిండియా కోరిక మేరకే మయాంక్ ను ఇంగ్లాండ్ పంపిస్తున్నట్టు తెలుస్తోంది.

మయాంక్ వస్తే ఓపెనింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ తన పాత స్థానమైన నం.4లో ఆడతాడు. ఇప్పుడాస్థానంలో ఆడుతున్న రిషబ్ పంత్ కు మరో అవకాశం ఇచ్చి, అతను గనుక విఫలమైతే అతడి స్థానంలో మయాంక్ ను తుది జట్టులోకి తీసుకోవాలన్నది టీమిండియా ప్లాన్! మయాంక్ ను ఓపెనర్ గా పంపితే, రాహుల్ నం.4 స్థానంలో బరిలో దిగుతాడు.

More Telugu News