Andhra Pradesh: చంద్రబాబు అక్కడే ఫెయిల్ అయ్యాడు.. కేసీఆర్ మాత్రం పక్కా ప్లాన్ తో సక్సెస్ అయ్యాడు!: సీపీఐ నారాయణ

  • బీజేపీతో పొత్తు వద్దన్నాం.. బాబు వినలేదు
  • మా కూటమిని బాబుకు అనుబంధంగా ప్రజలు భావించారు
  • మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీపీఐ నేత

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దని తాము కోరామనీ, కానీ టీడీపీ అధినేత చంద్రబాబు వినిపించుకోలేదని సీపీఐ నేత నారాయణ తెలిపారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వంలోనే కొనసాగాలని ఆయన కోరుకున్నారని వ్యాఖ్యానించారు. ఇటీవలి ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓ ఫ్రంట్ గా ఏర్పడి ముందుకు పోవాలని వామపక్ష పార్టీలు భావించాయని చెప్పారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో చర్చించి ఒప్పందానికి వచ్చామని పేర్కొన్నారు. ఇలా ఓ రాజకీయ వేదికను ఏర్పాటు చేశామనీ, అయితే అది సక్సెస్ కాలేదని వ్యాఖ్యానించారు.

అయితే ఏపీ ప్రజలు మాత్రం తమ కూటమిని చంద్రబాబుకు అనుబంధంగా ఉన్నట్లు భావించారని నారాయణ తెలిపారు. రాజకీయాల్లో విశ్వసనీయత అన్నది అవసరమని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎంత కష్టపడినప్పటికీ క్షేత్రస్థాయిలో టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం గజదొంగలుగా తయారు అయ్యారని విమర్శించారు. ఈ విషయాన్ని తాను అప్పట్లోనే బాహాటంగా చెప్పానని గుర్తుచేశారు.

ఈరోజు చంద్రబాబు కోసం ప్రాణాలు ఇస్తాం అని నిలబడేవారు జిల్లాకు కనీసం ఇద్దరు, ముగ్గురు కూడా లేరని స్పష్టం చేశారు. ఓ ఆడకూతురు ఇసుక దొంగలను పట్టుకుంటే ఆమెను శిక్షించడం ఏంటని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లు ఖాళీగా ఉండి, చివర్లో సంక్షేమ పథకాలు అమలుచేస్తే ప్రయోజనం ఏముంటుందని అడిగారు. అదే సమయంలో తెలంగాణ కేసీఆర్ మాత్రం రెండున్నర సంవత్సరాల ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాడనీ, విజయం సాధించారని నారాయణ విశ్లేషించారు.

More Telugu News