Chennai: చెన్నై వ్యాపారి ఆఫర్... కిలో దోశ పిండి కొంటే బిందెడు నీరు ఉచితమట!

  • చెన్నైలో ఎన్నడూలేనంత నీటి కష్టం
  • వినూత్నంగా ఆలోచించిన వ్యాపారి
  • ఒక్కసారిగా పెరిగిన అమ్మకాలు

చెన్నైలో నీటి ఎద్దడి ఎంత అధికంగా ఉందో అందరికీ తెలిసిందే. నీరు లేక, ఐటీ కంపెనీలకు కూడా సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితి. తాను స్నానం చేసేందుకు అర బక్కెట్ నీటి కోసం వేచి చూడాల్సి వచ్చిందని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారంటే, అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక, ప్రస్తుతం చెన్నైలో బిందె నీటిని రూ. 5 నుంచి పది రూపాయల వరకు విక్రయిస్తున్నారు. నగరంలోని నీటి ఎద్దడిని తన వ్యాపారం పెంచుకునేందుకు వినియోగించుకోవాలని ప్లాన్ వేశాడో వ్యాపారి.

వినూత్నంగా ఆలోచించి, తన వద్ద ఉన్న దోశ పిండి అమ్మకాలను పెంచుకునేందుకు, కిలో పిండి కొంటే, బిందె నీరు ఉచితమని ప్రకటించాడు. ఈ మేరకు అతని దుకాణం ముందు పెట్టిన ప్లెక్సీ అందరినీ ఆకర్షిస్తుండగా, నీళ్ల కోసం దోశ పిండి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది. ఇప్పుడతని దుకాణం కస్టమర్లతో కిటకిటలాడుతోంది. తాను 24 సంవత్సరాలుగా ఈ దుకాణం నడుపుతున్నానని, నీరు ఉచితమన్న తరువాత అమ్మకాలు బాగా పెరిగాయని దుకాణం యజమాని అంటున్నాడు. 

More Telugu News