Flight: విమానంలో తన పాప ఏడిస్తే ఎవరూ కోపగించుకోకుండా ఉండేందుకు ఓ తల్లి స్వీట్ ప్లాన్!

  • సౌత్ కొరియా నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వస్తున్న విమానం
  • విమానంలో నాలుగు నెలల బిడ్డతో తల్లి
  • మిగతా ప్రయాణికులకు క్యాండీస్, ఇయర్ బడ్స్
  • పాపను ముద్దు చేసిన ప్యాసింజర్స్

విమానంలో వేలకు వేలు ఖర్చు పెట్టి ఒకచోటి నుంచి మరో చోటకు ప్రయాణించేవారు, ప్రయాణం మొదలుకాగానే విశ్రాంతి తీసుకోవాలనో, ఓ కునుకేయాలనో భావిస్తారు. ఆ సమయంలో ఎవరైనా పిల్లలు గుక్కతిప్పుకోకుండా ఏడ్చినా, పక్కన ఉన్నవారు వాగుడుకాయలా మాట్లాడుతున్నా విసుగు సహజం. కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు కూడా. ఈ తరహా ఘటనలతో వారిని విమానం దించేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇక సౌత్ కొరియా నుంచి శాన్‌ ఫ్రాన్సిస్కోకు విమానంలో బయలుదేరిన ఓ యువతి తన నాలుగు నెలల చిన్నారి పాప వల్ల మిగతా వారికి ఇబ్బంది కలగవచ్చని భావించి మాస్టర్ ప్లాన్ వేసింది.

ఆమె వేసిన వినూత్న ఉపాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. విమానం ఎక్కిన వెంటనే ఆమె అందరు ప్రయాణికులకు క్యాండీస్, ఇయర్ ప్లగ్స్ ఉన్న ప్యాకెట్లను అందించింది. వాటిపై "నా పేరు జున్వూ. నా వయసు నాలుగు నెలలు మాత్రమే. నేను తొలిసారి మా అమ్మ, అమ్మమ్మతో కలిసి అమెరికాలో ఉన్న ఆంటీ వద్దకు వెళుతున్నాను. నేను విమానం ఎక్కడం ఇదే ఫస్ట్ టైమ్. విమానంలో నేను ఏడిస్తే, నా వల్ల మీకు ఇబ్బంది కలుగుతుందేమోనని మా అమ్మ మీకోసం ఓ బ్యాగ్ తయారుచేసింది. అందులో క్యాండీస్, ఇయర్ ప్లగ్స్ ఉన్నాయి. నేను ఏడవకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను. కానీ ఏడిస్తే అమ్మ ఇచ్చిన క్యాండీస్ తిని, నన్ను క్షమించండి" అని రాసివుంది.

ఇది చదివిన వారంతా ఒక్కసారిగా పాపను అక్కున చేర్చుకుని ముద్దాడారు. పాప ఏడవటం సహజమని, దాన్ని అందరమూ అర్థం చేసుకుంటామని ఆమెకు చెప్పారు.

More Telugu News