England: భారత జైత్రయాత్రకు బ్రేక్.. విజయంతో సెమీస్ ఆశలు నిలుపుకున్న ఇంగ్లండ్!

  • తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెలరేగిన ఇంగ్లండ్
  • రోహిత్ సెంచరీ వృథా
  • ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి ఓటమి

ఈ ప్రపంచకప్‌లో ఓటమన్నదే ఎరుగకుండా దూసుకెళ్తున్న కోహ్లీసేనకు తొలిసారిగా ఇంగ్లండ్ ఓటమి దెబ్బను రుచిచూపింది. ఆదివారం ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి ఇంగ్లండ్ సెమీస్ ఆశలు నిలుపుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు చేసింది.

సెమీస్‌కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్లు విశ్వరూరం ప్రదర్శించారు. క్రీజులోకి దిగింది మొదలు బంతిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఓపెనర్లు జాసన్ రాయ్-జానీ బెయిర్‌స్టోలు చెలరేగిపోయారు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 160 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

66 పరుగులు చేసిన రాయ్‌ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్ పంపినప్పటికీ క్రీజులో పాతుకుపోయిన బెయిర్‌స్టో జోరు తగ్గలేదు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత షమీ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత షమీ విజృంభణతో ఇంగ్లండ్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. రూట్ 44, బెన్‌స్టోక్స్ 79 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కోల్పోయిన ఏడు వికెట్లలో ఐదు షమీ సాధించినవే కావడం గమనార్హం.

అనంతరం 338 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 306 పరుగులకే కుప్పకూలి 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ప్రపంచకప్‌లో భారత్‌కు ఇది తొలి ఓటమి. లోకేశ్ రాహుల్ డకౌట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ.. రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను పునర్నిర్మించాడు. ఈ క్రమంలో కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, రోహిత్ సెంచరీ నమోదు చేశాడు. భారత్ లక్ష్యం దిశగా సాగుతున్న వేళ కోహ్లీ (66), రోహిత్ శర్మ (102) వికెట్లను కోల్పోవడంతో భారత్ పతనం ప్రారంభమైంది. క్రీజులో ఉన్నంత సేపు హార్దిక్ పాండ్యా (45) మెరుపులు మెరిపించి ఆశలు రేపినప్పటికీ అతడు అవుటయ్యాక మ్యాచ్ ఇంగ్లండ్ చేతుల్లోకి వెళ్లిపోయింది.

పంత్ 32, పాండ్యా 45, ధోనీ 42, కేదార్ జాదవ్ 12 పరుగులు చేశారు. సెంచరీ వీరుడు బెయిర్‌స్టోకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ లభించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ 10 పాయింట్లతో పాకిస్థాన్‌ను కిందికి నెట్టేసి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

More Telugu News