Andhra Pradesh: విశాఖ టీడీపీ ఆఫీసు అక్రమ నిర్మాణమే.. కూల్చేస్తామని నోటీసులు జారీచేసిన జీవీఎంసీ!

  • అనుమతులు తీసుకోకుండా ఈ నిర్మాణాన్ని కట్టారు
  • వారం రోజుల్లోగా ఈ విషయమై సంజాయిషీ ఇవ్వండి
  • అనుమతులకు సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్లను సమర్పించండి
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కూల్చివేతల పర్వం నడుస్తోంది. ఇటీవల అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ ఉండవల్లిలోని ప్రజావేదికను ఏపీ ప్రభుత్వం కూల్చివేసిన సంగతి తెలిసిందే. అలాగే టీడీపీ నేత మురళీ మోహన్ కు చెందిన కార్ షోరూమ్ ను కూడా కూల్చివేసింది.

అంతేకాకుండా దాదాపు 10 భవనాలకు నోటీసులు జారీచేసింది. తాజాగా విశాఖపట్నం నగరంలోని టీడీపీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీచేశారు. విశాఖ నడిబొడ్డున ఎలాంటి అనుమతులు లేకుండా ఈ కార్యాలయాన్ని కట్టారని జీవీఎంసీ అధికారులు తెలిపారు.

టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి అనుమతి తీసుకోకుండా ఈ నిర్మాణం చేపట్టారని వెల్లడించారు. వారం రోజుల్లోగా ఈ నిర్మాణం అనుమతులకు సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్లు సమర్పించకపోతే కూల్చివేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు టీడీపీ విశాఖ అధ్యక్షుడికి జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీచేశారు. కాగా, తమ వద్ద ఈ స్థలానికి సంబంధించి అన్ని పత్రాలు ఉన్నాయనీ, త్వరలోనే అధికారులకు అందజేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు.
Andhra Pradesh
Visakhapatnam District
Telugudesam
illegal construction

More Telugu News