Australia: 157 పరుగులకే కుప్పకూలిన కివీస్.. ఆసీస్ ఘన విజయం

  • 86 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన న్యూజిలాండ్
  • అద్భుత స్పెల్‌తో అదరగొట్టిన మిచెల్ స్టార్క్
  • ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా అలెక్స్ కేరీ

ప్రపంచకప్‌లో భాగంగా లార్డ్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ చిత్తుగా ఓడింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 43.4 ఓవర్లలో 157 పరుగులకే ఆలవుటై 86 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. మిచెల్ స్టార్క్ అద్భుత స్పెల్‌తో కివీస్‌కు చుక్కలు చూపించాడు. 9.4 ఓవర్లు వేసిన స్టార్క్ 26 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. కేన్ విలియమ్సన్ (40), రాస్ టేలర్ (30), మార్టిన్ గప్టిల్ (20) ఆ మాత్రమైనా రాణించడంతో కివీస్ స్కోరు 150 పరుగులు దాటింది. ఆరుగురు ఆటగాళ్లు కనీసం పది పరుగులు కూడా చేయలేకపోయారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ట్రెంట్ బౌల్ట్ హ్యాట్రిక్ దెబ్బకు 243 పరుగులకే పరిమితమైంది. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ వేసిన బౌల్ట్.. ఉస్మాన్ ఖావాజా (88), మిచెల్ స్టార్క్ (0), బెహ్రెండార్ఫ్ (0)లను వరుస బంతుల్లో పెవిలియన్ పంపి రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్‌లో కివీస్‌కు ఇదే తొలి హ్యాట్రిక్. కీలక సమయంలో 72 బంతుల్లో 11 ఫోర్లతో 71 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అలెక్స్ కేరీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ గెలుపుతో 14 పాయింట్లో ఆసీస్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లగా, న్యూజిలాండ్ 11 పాయింట్లో మూడో స్థానంలో ఉంది. ఆప్ఘనిస్థాన్‌పై చచ్చీచెడి గెలిచిన పాక్ 9 పాయింట్లతో ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టేసి నాలుగో స్థానానికి చేరుకుంది.

More Telugu News