Andhra Pradesh: తెలుగు ప్రజలకు తాగు, సాగు నీరు అందించేందుకు కలిసి పనిచేస్తాం: మంత్రి బుగ్గన

  • రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో నదీజలాలు ఉన్నాయి
  • నదీ జలాలను ఎలా వినియోగించుకోవాలో చర్చించాం
  • జూలై 15 లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని కోరాం

ఏపీ, తెలంగాణ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఈటల రాజేందర్ లు హైదరాబాద్ లో ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ, ఇది చారిత్రాత్మకమైన రోజు అని అన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి నదీ జలాలను ఎలా వినియోగించుకోవాలో చర్చించామని, ఇందుకు సంబంధించి జూలై 15 లోగా ప్రాథమిక నివేదికను ఇవ్వాలని కమిటీని కోరినట్టు చెప్పారు.

తెలుగు ప్రజలకు తాగు, సాగునీరు అందించేందుకు కలిసి పని చేస్తామని, నదీజలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాలు దేశానికే ఆదర్శంగా ఉండాలని అన్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో నదీజలాలు ఉన్నాయని, భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా చర్చించుకుని పరిష్కరించుకుంటామని చెప్పారు. రెండు రాష్ట్రాలు కలిసిమెలిసి ముందుకెళ్లాలని ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయించారని, ఏఏ ప్రాంతాలకు గోదావరి నీరు ఇవ్వవచ్చో నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను వారు కోరినట్టు చెప్పారు. 

More Telugu News