Chandrababu: ఒకప్పుడు చంద్రబాబు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్: ‘లోక్ సత్తా’ జయప్రకాశ్ నారాయణ్

  • రూపాయకు పది రూపాయల విలువ వచ్చేలా చేయాలి
  • ఈ దేశంలో రాజరిక స్వభావంతో పరిపాలన సాగుతోంది
  • ప్రజాధనాన్ని చాలా పవిత్రంగా చూడాలి

‘డబ్బు’ను ఆషామాషీగా చూడొద్దని, ముఖ్యంగా ప్రజాధనాన్ని చాలా పవిత్రంగా చూడాలని ‘లోక్ సత్తా’ అధినేత జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ దేశంలో నిరుపేద కుటుంబాల వాళ్లు ఉప్పుతిన్నా పప్పు తిన్నా కూడా పన్నులు కడతారని, అటువంటి పన్నుల డబ్బులతో ప్రభుత్వాలు నడుస్తాయని చెప్పారు. కనుక, ప్రజాధనాన్ని పవిత్రంగా భావించి ఒక రూపాయకు పది రూపాయల విలువ వచ్చేట్టు చేయాలని అభిప్రాయపడ్డారు. ఈ దేశంలో రాజరిక స్వభావంతో పరిపాలన సాగుతోందని, నరేంద్ర మోదీ, అంతకుముందున్న ప్రభుత్వాలు వాళ్ల సొంత ప్రచారానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయని విమర్శించారు. రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉందని, ఒకప్పుడు చంద్రబాబునాయుడు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్.. మిగతావాళ్లు అని విమర్శించారు.

అలాగే, వేల కోట్ల ప్రజాధనాన్ని తమ విలాసాల కోసం వాడుకుంటున్నారని, నివాసగృహాలను రాజగృహాల మాదిరి నిర్మించుకుంటున్నారని, వీరి నివాసగృహాలన్నీ కూడా పూర్వకాలపు చక్రవర్తుల నివాసాలను తలపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. భవనాల నిర్మాణానికి గాను చదరపు అడుగుకు వేల రూపాయలను ఖర్చు పెడుతున్నారని, ఆ తర్వాత ఆ భవనాలు ఇష్టం లేదని కూల్చి వేస్తున్నారని విమర్శించారు. ప్రజాధనం వినియోగం విషయంలో కనీస ఇంగితజ్ఞానం, నమ్రత లేకుండా పోతున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేతలు వినియోగించే కార్లు, కార్యాలయాలు సౌకర్యంగా ఉండాలనే కోరుకుంటాను కానీ, అందుకు, యాభై లక్షలు, డెబ్బై లక్షలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. 

More Telugu News