ప్రపంచకప్ ఎవరిదో చెప్పేసిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ వాన్

28-06-2019 Fri 09:59
  • ఈ ప్రపంచకప్‌లో అప్రతిహతంగా దూసుకెళ్తున్న భారత్
  • ఆడిన ఆరు మ్యాచుల్లోనూ విజయ గీతం
  • భారత్‌ను ఓడించే వారిదే ప్రపంచకప్ అన్న వాన్
ఐసీసీ ప్రపంచకప్‌ను ఎగరేసుకెళ్లేదెవరు? ఈ ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతున్నారు. కొందరు ఇంగ్లండ్ అంటే, ఇంకొందరు భారత్‌దే గెలుపు అంటున్నారు. మరికొందరు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పేర్లు చెబుతున్నారు. మరోవైపు 1992 ప్రపంచకప్‌తో పోల్చుతూ పాకిస్థాన్‌ రెండోసారి కప్పు కొట్టుకెళ్లడం ఖాయమంటున్నారు.

ఎవరి అంచనాలు, అభిప్రాయాలు ఎలా ఉన్నా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మాత్రం ఈ విషయంలో కొంత స్పష్టతతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో కోహ్లీ సేనను ఓడించిన వారే కప్పును చేజిక్కించుకుంటారని చెబుతున్నాడు. అంతేకాదు, తాను ఇదే మాటపై నిలబడతానని స్పష్టం చేశాడు. ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఓటమన్నదే ఎరుగని భారత్.. గురువారం విండీస్‌పై 125 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన అనంతరం వాన్ ఈ ట్వీట్ చేశాడు.