bjp: బీజేపీలో చేరిన నలుగురు టీటీడీపీ, కాంగ్రెస్ నేతలు

  • బీజేపీలో చేరిన టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, చాడ సురేష్ రెడ్డి, బోడ జనార్దన్ 
  • కాషాయ కండువా కప్పుకున్న కాంగ్రెస్ నేత శశిధర్ రెడ్డి 
  • టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకాలు శ్రుతి మించుతున్నాయన్న మురళీధరరావు

 తెలంగాణలో బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి భారీ ఎత్తున చేరికలు చోటు చేసుకుంటున్నాయి. కాసేపటి క్రితం టీటీడీపీ నేతలు పెద్దిరెడ్డి, చాడ సురేష్ రెడ్డి, బోడ జనార్దన్... కాంగ్రెస్ నేత శశిధర్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో బీజేపీ కీలక నేత మురళీధరరావు సమక్షంలో వీరు బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా మురళీధరరావు మాట్లాడుతూ, తెలంగాణలో టీఆర్ఎస్ కు కాంగ్రెస్, టీడీపీ ప్రత్యామ్నాయం కావని చెప్పారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని... అందుకే ఇతర పార్టీల్లో కీలక స్థానాల్లో పని చేసిన నేతలంతా బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. ఈ రోజు బీజేపీలో చేరిన నేతలందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో చేరికలు భారీ సంఖ్యలో ఉండబోతున్నాయని చెప్పారు.

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకాలు రోజురోజుకూ శ్రుతి మించుతున్నాయని... విపక్షాలు తమ గొంతుకను వినిపించే అవకాశం కూడా లేకుండా పోయిందని మురళీధరరావు విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా పోయిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రథకాలకు కూడా టీఎస్ ప్రభుత్వం అడ్డుపడుతోందని విమర్శించారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే సామర్థ్యం బీజేపీకి మాత్రమే ఉందని చెప్పారు. కుటుంబపాలనకు, కుల రాజకీయాలకు బీజేపీ దూరమని అన్నారు. అందుకే, టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉన్న నేతలందరికీ బీజేపీనే సరైన పార్టీగా కనిపిస్తోందని చెప్పారు. మోదీ నాయకత్వంలో పనిచేయడానికి మొగ్గుచూపుతున్నారని తెలిపారు. అందుకే టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి భారీ సంఖ్యలో బీజేపీలో చేరుతున్నారని చెప్పారు.

More Telugu News