Andhra Pradesh: సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఇంటర్ విద్యార్థులకూ ‘అమ్మఒడి’ పథకం వర్తింపు!

  • క్యాంపు ఆఫీసులో విద్యాశాఖ అధికారులతో సమీక్ష
  • హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూలు పిల్లలకు కూడా అమ్మఒడి వర్తింపు
  • వీసీల నియామకానికి సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశం సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పిల్లలను పాఠశాలకు పంపే ప్రతీ తల్లికి అమ్మఒడి పథకం కింద ఏటా రూ.15,000 ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా అమ్మఒడి పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించారు.

హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీతల్లికి ఏటా రూ.15 వేలు ఇస్తామని పునరుద్ఘాటించారు. ఇక విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకం కోసం వెంటనే సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. రాబోయే 30 రోజుల్లోగా వీసీల నియామకాలు పూర్తికావాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో ఉన్న అన్ని ఖాళీలను ఏడాది చివరికల్లా భర్తీ చేయాలని చెప్పారు. పారదర్శక విధానంలో, అత్యంత అనుభవం ఉన్నవారినే వీసీలుగా ఎంపిక చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలనీ, మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
Andhra Pradesh
Jagan
Chief Minister
amma vodi
inter students
15000 rupees

More Telugu News