India: మోదీ ప్రభుత్వాన్ని ఏకిపారేసిన యువ ఎంపీ.. అంతర్జాతీయంగా ప్రశంసల వర్షం!

  • లోక్ సభలో టీఎంసీ ఎంపీ మెహువా మొయిత్ర ప్రసంగం
  • భారత్ లో ఫాసిజం లక్షణాలు కనిపిస్తున్నాయి   
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

మహువా మొయిత్ర.. నిన్న మొన్నటివరకూ ఈ పేరు దేశంలో ఎవ్వరికీ తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్క భారత్ లోనే కాకుండా అంతర్జాతీయంగానూ ఆమె పేరు మార్మోగిపోతోంది. ఇంతకు మహువా మొయిత్ర పెద్ద(44) సెలబ్రిటీ ఏం కాదు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ లోని కృష్ణానగర్ లోక్ సభ సీటు నుంచి టీఎంసీ ఎంపీగా గెలుపొందారు. నిన్న లోక్ సభ సమావేశాల సందర్భంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా తూర్పారపట్టారు.

భారత్ ప్రస్తుతం ఫాసిజం అడుగుజాడల్లో నడుస్తోందని మండిపడ్డారు. ఇందులో భాగంగా జాతీయవాదాన్ని నూరిపోస్తున్నారనీ, మానవహక్కులు, కళలను పట్టించుకోవడం లేదని గుర్తుచేశారు. జాతీయ భద్రతను పదేపదే ప్రస్తావిస్తూ, మీడియాను నియంత్రిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారత్ లో 50 ఏళ్లుగా ఉంటున్నవారిని పౌరసత్వం నిరూపించుకునేందుకు కాగితాలు చూపించాలని వేధిస్తున్నారని అన్నారు. అధికారం కోసం ప్రజలను విభజిస్తున్నారనీ, ఎన్నికల వ్యవస్థ స్వతంత్రత దెబ్బతిందని తెలిపారు. ఇవన్నీ ఫాసిజానికి ఆరంభ లక్షణాలని అన్నారు. కాగా, ఈ ప్రసంగాన్ని చాలామంది ‘స్పీచ్ ఆఫ్ ది ఇయర్’గా అభివర్ణించారు.

మహువా మొయిత్ర లోక్ సభ లో ప్రసంగిస్తుండగా, పలుమార్లు బీజేపీ సభ్యులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మహువా మొయిత్ర ఈ ప్రయత్నాలను తిప్పికొట్టారు. ఈ వీడియోను లక్షల మంది షేర్ చేసుకున్నారు. బీబీసీ సహా పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు మహువా మొయిత్ర ప్రసంగ పాఠాన్ని ప్రముఖంగా ప్రచురించాయి.

More Telugu News