Telangana: తెలంగాణకు ఆసుపత్రులు, హాస్టళ్లు కావాలి.. భవనాలు, భవంతులు కాదు!: టీజేఎస్ అధినేత కోదండరాం

  • నూతన సచివాలయం నిర్మిస్తామంటున్న కేసీఆర్
  • ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తప్పుపట్టిన కోదండరాం
  • స్వార్థం కోసమే కొందరు పార్టీ మారుతున్నారని ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రంలో నూతన సచివాలయం నిర్మిస్తామని సీఎం కేసీఆర్ చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని తెలంగాణ జనసమితి నేత ప్రొ.కోదండరాం తీవ్రంగా తప్పుపట్టారు. ప్రస్తుతం తెలంగాణకు కొత్త భవనాలు అక్కర్లేదనీ, ఆసుపత్రులు, విద్యార్థులు ఉండేందుకు హాస్టళ్లు, వాటిలో కనీస సదుపాయాలు కావాలని వ్యాఖ్యానించారు. ఒక్కసారి వాన పడితేనే హైదరాబాద్ మహానగరం గందరగోళంగా మారిపోతోందని విమర్శించారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కోదండరాం మాట్లాడారు.

నదుల అనుసంధానం ప్రక్రియను హడావుడిగా చేపట్టవద్దని తెలంగాణ ప్రభుత్వానికి కోదండరాం సూచించారు. గోదావరి నీళ్లు కృష్ణా బేసిన్ కు తీసుకుని వస్తే ఎగువ రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని గుర్తుచేశారు. నదుల అనుసంధానం ముసుగులో సీఎం కేసీఆర్ విభజన సమస్యలను పక్కన పెడుతున్నారని ఆరోపించారు. ఇక కొందరు నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీలు ఫిరాయిస్తున్నారని స్పష్టం చేశారు. వచ్చే నెల 13న తెలంగాణ జనసమితి ప్లీనరీ నిర్వహిస్తామని కోదండరాం తెలిపారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని ప్రకటించారు.

More Telugu News