bihar: బిహార్ వైద్యుల నిర్వాకం.. ఎడమచేయి విరిగితే కుడిచేతికి చికిత్స!

  • మెదడువాపుతో ఇప్పటికే పలువురు చిన్నారుల మృత్యువాత
  • పట్నా మెడికల్ కాలేజీలో ఈరోజు వైద్యుల నిర్వాకం
  • విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు

బిహార్ లో ఇటీవలి కాలంలో మెదడువాపు వ్యాధి లక్షణాలతో 130 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో బిహార్ ఆరోగ్యశాఖతో పాటు డాక్టర్ల పనితీరుపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా పట్నాలోని ఓ మెడికల్ ఆసుపత్రిలో వైద్యులు ప్రవర్తించిన తీరు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. పట్నాలోని ప్రభుత్వ వైద్యకళాశాలకు ఫైజాన్ అనే బాలుడు తల్లిదండ్రులతో కలిసి వచ్చాడు. మామిడి చెట్టుపై నుంచి కింద పడటంతో ఫైజాన్ ఎడమచేతి ఎముక విరిగినట్లు ఎక్స్ రే పరీక్షల్లో నిర్ధారణ అయింది.

ఈ సందర్భంగా ఎవరయినా ఎడమ చేతికే చికిత్స అందిస్తారు. కానీ బిహార్ వైద్యులు మాత్రం కుడిచేతికి ఎంచక్కా కట్టు కట్టేశారు. ‘నా ఎడమ చేతికి గాయం అయింది మొర్రో’ అని బాలుడు చెబుతున్నా ఒక్కరూ వినిపించుకున్న పాపాన పోలేదు. కనీసం గాయానికి మందులు కూడా ఇవ్వలేదు. ఈ విషయం మీడియాలో రావడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. వెంటనే రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు ఈ నిర్వాకంపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని వైద్యులను కూడా ఆదేశించారు.

More Telugu News