Uttar Pradesh: అధికారులను బంధించి చావబాదిన ఎస్పీ నేత!

  • ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో ఘటన
  • తన దాబాలో తనిఖీలు నిర్వహించేందుకు వచ్చిన అధికారులపై దాడి
  • దుస్తులు చించి, డబ్బులు దోచుకున్న దాబా సిబ్బంది

తన ఆధ్వర్యంలో నడుస్తున్న దాబాలో తనిఖీలు చేపట్టడమే కాకుండా లైసెన్స్ అడిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులపై సమాజ్‌వాదీ పార్టీ నేత ఒకరు చెలరేగిపోయారు. అధికారులను బంధించి చితకబాదారు. అక్కడితో ఆగక వారి దుస్తులు చింపి వారి వద్దనున్న డబ్బులను దోచుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో జరిగిందీ ఘటన.

సమాజ్‌వాదీ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు మజాహిర్ ముఖియాకు చెందిన దాబాలో ఫుడ్ సేఫ్టీ అధికారి రణ‌ధీర్ సింగ్ తన బృందంతో కలిసి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాబా లైసెన్స్ చూపించాలంటూ యజమానిని అధికారి రణధీర్ సింగ్ కోరారు. దీంతో రెచ్చిపోయిన మజాహిర్ దాబా సిబ్బందితో కలిసి అధికారులపై దాడి చేశారు. వారిని బంధించి దుస్తులు చించేశారు. అనంతరం వారి వద్దనున్న డబ్బులను దాబా సిబ్బంది కాజేశారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అధికారులను విడిపించారు. దాడికి పాల్పడిన ముఖియాతో పాటు అతడి ఇద్దరు కుమారులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News