బీజేపీలో చేరితే భవిష్యత్ సీఎంను నేనే: ప్రకంపనలు రేపుతున్న కోమటిరెడ్డి ఆడియో టేప్

25-06-2019 Tue 06:49
  • కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు
  • ఈ విషయం రాహుల్‌కు కూడా తెలుసు
  • కార్యకర్తతో రాజగోపాల్ ఫోన్ సంభాషణ
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓ కార్యకర్తతో మాట్లాడినట్టు చెబుతున్న ఆడియో టేప్ ఒకటి ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజగోపాల్ బీజేపీలో చేరడం ఖాయమన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో విషయం తెలుసుకునేందుకు ఆయనకు సన్నిహితంగా మెలిగే ఓ కార్యకర్త ఫోన్ చేశారు. రాజగోపాల్ ఆయనతో మాట్లాడుతూ.. తాను కనుక బీజేపీలో చేరితే తెలంగాణకు భవిష్యత్ ముఖ్యమంత్రిని తానే అవుతానని పేర్కొన్నారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని ఈ విషయం పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి కూడా తెలుసని వ్యాఖ్యానించారు. ఇప్పుడీ ఆడియో టేప్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనమైంది.

గత కొంతకాలంగా బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్న రాజగోపాల్ ఆ పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నెల 28న ఆయన ఢిల్లీ వెళ్లనుండడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. అదే రోజు ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.