Jagan: చూసీచూడనట్టుపోవాలని నాపైనా ఒత్తిడి తెచ్చారు... అయినా అవినీతిపై పోరాటానికి సిద్ధమయ్యా: సీఎం జగన్

  • అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించను
  • పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు ఓ సందేశం వెళ్లాలి
  • 'సాక్షి'లో పోలవరంపై వచ్చిన కథనాలను ప్రస్తావించిన సీఎం

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజక్టుల్లో అవినీతి జరగడానికి వీల్లేదని సీఎం జగన్ పునరుద్ఘాటించారు. ప్రభుత్వ ఇంజినీరింగ్ నిపుణులతో అమరావతిలో సమావేశం నిర్వహించిన ఆయన తన ఉద్దేశాలను మరింత స్పష్టంగా అధికారులకు వివరించారు. వ్యవస్థలను బాగు చేసుకోవడానికి తపిస్తున్నానని, టెండర్ల విధానం మరింత పారదర్శకంగా ఉండాలన్నదే తన అభిమతమని స్పష్టం చేశారు.

ప్రాజక్టుల విషయంలో కళ్లుమూసుకుని ఉండాలని తనపైనా ఒత్తిడి తెచ్చారని, అయితే, అవినీతిపై పోరాటానికి తాను సిద్ధమయ్యానని వెల్లడించారు. అవినీతి విషయంలో అది ఏ స్థాయిలో ఉన్నా తాను సహించబోనని, పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు ఒక సందేశం వెళ్లాలని జగన్ హెచ్చరిక ధోరణిలో చెప్పారు.

ఇక, టెండరింగ్ విధానాల గురించి చెబుతూ, ఒక పని రూ.100కు బదులుగా రూ.80కే జరిగే వీలుంటే రివర్స్ టెండరింగ్ కు వెళదామని ఇంజినీరింగ్ నిపుణులకు సూచించారు. రివర్స్ టెండరింగ్ ఎక్కడ చేయగలమో అధికారులు గుర్తించాలని అన్నారు. ఏపీ ప్రభుత్వ పారదర్శక విధానాలు దేశానికి ఒక సంకేతం పంపాలని సీఎం జగన్ అభిలషించారు. ఇప్పటికే టెండరింగ్ విధానాల పర్యవేక్షణకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుకు విజ్ఞప్తి చేశామని తెలిపారు.

ఈ సందర్భంగా జగన్, రెండ్రోజుల కిందట సాక్షి దినపత్రికలో పోలవరం ప్రాజక్టులో అవినీతి పేరిట వచ్చిన కథనాలను ప్రస్తావించారు. పోలవరం నిర్మాణ పనుల్లో అక్రమాలపై నిజానిజాలు వెలికితీయాలని నిపుణులను ఆదేశించారు. ఓవైపు రాష్ట్ర ఆర్థికపరిస్థితి పతనం దిశగా పయనిస్తుంటే, అవినీతి వల్ల మరింత దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజక్టును గందరగోళంగా మార్చేసిందని ఆరోపించారు.

స్పిల్ వే పూర్తిచేయకుండా కాఫర్ డ్యాం నిర్మాణం మొదలుపెట్టారని, కాఫర్ డ్యాం కూడా పూర్తిచేయకుండానే వదిలేశారని మండిపడ్డారు. దాంతో ప్రాజక్టు వద్ద గోదావరిలో వెడల్పు తగ్గిందని, భారీగా వరద వస్తే కనీసం 4 నెలల పాటు పనులు చేపట్టలేని పరిస్థితి ఉందని అన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న సీఎం జగన్, పోలవరం తనకు అత్యంత ప్రాధాన్యత ఉన్న ప్రాజక్టు అని పునరుద్ఘాటించారు.

More Telugu News