Telugudesam: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ద్వారా నన్ను బెదిరించారు.. నన్ను లోపలేయించి, బోల్టులు తిప్పిస్తారట!: బుద్ధా వెంకన్న ఆరోపణలు

  • ఫిరాయింపులకు పాల్పడ్డ టీడీపీ ఎంపీలపై ఆరోపణలు
  • యార్లగడ్డ నిన్న రాత్రి నాకు ఫోన్ చేశారు
  • ఫిరాయింపు ఎంపీలకు వ్యతిరేకంగా మాట్లాడొద్దన్నారు

ఫిరాయింపులకు పాల్పడ్డ టీడీపీ ఎంపీలపై విమర్శలు చేస్తున్న తనకు బెదిరింపులు వస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘వైఎల్పీ గారు అంటే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు నాకు సన్నిహితంగా ఉండే వ్యక్తే. పదిరోజుల క్రితమే ఆయన, నేనూ కలవడం జరిగింది. కానీ, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాత్రి నాకు ఫోన్ చేసి ‘నువ్వు  ఎమ్మెల్సీవి ఎమ్మెల్సీలా ఉండు. పార్టీ ఫిరాయించిన ఎంపీల మీద నువ్వు ఇష్టానుసారం మాట్లాడుతున్నావు.. ఇలా మాట్లాడితే ఎంపీలు నిన్ను జైల్లో వేయించి, నట్లు తిప్పుతారు’ అని అన్నారు.

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఏదో సరదాగా మాట్లాడుతున్నారని అనుకున్నాను. ‘పక్కన ఉన్న ఎంపీలు చంద్రబాబుగారికి ఏం చేశారో తెలుసా?’ అని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అనడంతో, ‘మీరు ఎక్కడ ఉన్నారు?’ అని అడిగాను. ‘నేను ఢిల్లీలో ఉన్నాను’ అని ఆయన (యార్లగడ్డ లక్ష్మీప్రసాద్) చెప్పడంతో, ‘మీరు, సుజనా చౌదరి ఇంట్లో ఉన్నారు కదా!’ అని నేను అడిగాను. ఈ ఫోన్ కాల్ రాత్రి 10.45 గంటలకు నాకు వచ్చింది. ఆ సమయంలో నా పక్కనే భార్యాపిల్లలు ఉన్నారు. దీంతో, ఆ ఫోన్ కాల్ ను నేను కట్ చేశాను.

ఆ తర్వాత నేనే యార్లగడ్డకు ఫోన్ చేసి ‘ఏంటి బెదిరిస్తున్నావు?’ అని ప్రశ్నించాను. నేను చంద్రబాబునాయుడు కోసం ప్రాణాలిస్తా. జైలుకెళ్లడం పెద్ద లెక్కేమీ కాదు. మీలాగా జైలుకెళ్లేందుకు ఏమన్నా చీటింగ్ పనులు, బ్యాంకు దోపిడీలు చేశామా? అన్నాను. అయితే, నా మాట వినిపించుకోకుండా పదేపదే, ‘ఎంపీలు నిన్ను లోపలేయిస్తారు. నీకు బోల్టులు బిగిస్తారు’ అని ఒకటే మాటను నాలుగుసార్లు అన్నారు. పార్టీ  మారిన ఈ ఎంపీలకు నేను వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే జైల్లో వేయిస్తారని బెదిరింపు ధోరణిలో వార్నింగ్ ఇచ్చారు' అని చెప్పారు వెంకన్న.

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ను అడ్డం పెట్టుకుని తనను బెదిరిస్తే, భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తానేమీ అక్రమాలు, సెటిల్ మెంట్స్, దౌర్జన్యాలు చేయలేదని, టీడీపీ పాలనలో తనపై ఒక్క కేసు కూడా లేదని అన్నారు. తమ నాయకుడు చంద్రబాబు తనను గౌరవించి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారని, ఆయనకు చెడ్డపేరు రాకూడదని, చాలా నిష్ఠగా ప్రజాస్వామ్యానికే అంకితమయ్యానని చెప్పారు. అలాంటి తనను యార్లగడ్డ ద్వారా టీడీపీ నుంచి ఫిరాయించిన ఎంపీలు బెదిరింపులకు పాల్పడటం వారి దిగజారుడు తనానికి నిదర్శనమని బుద్ధా వెంకన్న విమర్శించారు.

More Telugu News