mansoons: రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. రెండు మూడు రోజుల్లో జోరుగా వర్షాలు

  • ఇప్పటికే ఏపీలో అక్కడక్కడా వర్షాలు
  • తెలుగు రాష్ట్రాల వైపు వేగంగా కదులుతున్న నైరుతి పవనాలు
  • చల్లబడిన వాతావరణం

నైరుతి రుతుపవనాల కదలికలో వేగం మొదలయ్యింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురుస్తుండగా ఈరోజు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతారణ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు బలహీనంగా ఉన్న నైరుతి పవనాల కదలికకు వాతావరణం అనుకూలంగా మారింది.

ఇప్పటికే కోస్తా కర్ణాటక, మధ్య మహారాష్ట్ర, గోవా, పశ్చిమబెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలతోపాటు బంగాళాఖాతంలో విస్తరించిన రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల వైపు కదులుతున్నాయి. మూడు రోజుల్లో కోస్తా, రాయలసీమ, తెలంగాణతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్‌కు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

రుతుపవనాలు విస్తరించేందుకు అనువుగా చెన్నైకి పైన తూర్పు, పడమర ద్రోణి కొనసాగుతోంది. ఇంకా దక్షిణ చత్తీస్‌గఢ్‌పై ఆవర్తనం ఏర్పడింది. ఇదే సమయంలో రుతుపవనాలు ప్రభావం చూపడంతో బుధవారం రాత్రి నుంచే కోస్తాలో వర్షాలు మొదలయ్యాయని ఆర్టీజీఎస్‌, ఇస్రో నిపుణులు తెలిపారు.

ఈ నెలలో సాధారణంగా 66.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 21.9 మిల్లీమీటర్లే నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చినందున నేటి నుంచి వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే రెండు రోజుల తర్వాత రుతుపవనాల కదలిక, ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేయవచ్చునని వివరించారు.

బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడితే నైరుతిలో చురుకుగా కదలిక వచ్చి జోరుగా వర్షాలు కురుస్తాయన్నారు. కొద్దిరోజుల నుంచి వేసవి తాపం, ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు గురువారం అక్కడక్కడా కురిసిన వర్షాలతో వాతావరణం చల్లబడి ఊరటనిచ్చింది. విశాఖనగరం మున్సిపల్‌ కార్యాలయం ప్రాంతంలో 88.75 మిల్లీమీటర్లు, బలిఘట్టం ప్రాంతంలో 75.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కృష్ణా జిల్లాలో కూడా పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి.

More Telugu News