terrorists: బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను చీల్చుకు వెళ్లే స్టీల్ బుల్లెట్లను వాడిన టెర్రరిస్టులు.. వీఐపీల భద్రతపై తీవ్ర ఆందోళన!

  • అనంతనాగ్ దాడిలో స్టీల్ బుల్లెట్లను వాడిన టెర్రరిస్టులు
  • బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను చీల్చుకెళ్లి జవాన్లను గాయపరిచిన బుల్లెట్లు
  • వీఐపీల బుల్లెట్ ప్రూఫ్ వాహనాలపై కూడా దాడి చేసే అవకాశం

ఈ నెల 12న జమ్ముకశ్మీర్ అనంతనాగ్ లో సీఆర్పీఎఫ్ పై టెర్రరిస్టులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో చైనా స్టీల్ బుల్లెట్లను ఉగ్రవాదులు వినియోగించారు. ఈ అంశం ఇప్పుడు భద్రతాదళాల అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ స్టీల్ బుల్లెట్లు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను సైతను చీల్చుకు వెళ్లి, జవాన్లను గాయపరిచాయి.

దాడి జరిగిన సమయంలో ఓ టెర్రరిస్టును భద్రతాదళాలు కాల్చి చంపాయి. అతని వద్ద నుంచి ఒక ఏకే47 రైఫిల్ తో పాటు, కొన్ని రౌండ్ల స్టీల్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నాయి. అనంతరం దీనిపై దర్యాప్తు చేసిన అధికారులు... ఈ బుల్లెట్లను జమ్ముకశ్మీర్ లోని టెర్రరిస్టులకు పాకిస్థాన్ ఐఎస్ఐ, జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ అందించాయని గుర్తించారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను సైతం చీల్చుకు వెళ్లే సామర్థ్యం ఈ బుల్లెట్లకు ఉండటంతో... ఈ చైనా బుల్లెట్లను టెర్రరిస్టులకు అందిస్తున్నాయి.

పుల్వామా దాడిలో సైతం ఇవే బుల్లెట్లు వాడి ఉంటారని నిఘా సంస్థలు భావిస్తున్నాయి. జమ్ముకశ్మీర్ లో జైషే మొహమ్మద్ చేసిన దాడుల్లో సైతం ఇవే బుల్లెట్లను వాడారు. ఏకే47 రైఫిల్స్ లో ఈ బుల్లెట్లను వాడవచ్చు. 2017 డిసెంబర్ 27న జైషే మొహమ్మద్ జరిపిన దాడిలో ఈ బుల్లెట్లను తొలిసారి వాడారు. స్టీల్ బుల్లెట్ల అంశాన్ని భారత అధికారులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. వీఐపీల సెక్యూరిటీకి ఉపయోగిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలపై కూడా వీటితో దాడి చేసే అవకాశం ఉండటం అధికారులను కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో, వీఐపీ సెక్యూరిటీ వ్యవస్థను కూడా సమీక్షించేందుకు సిద్ధమవుతున్నారు.

మరోవైపు, స్టీల్ బుల్లెట్లపై ప్రపంచ వ్యాప్తంగా నిషేధం ఉంది. అయినప్పటికీ, టెర్రరిస్టులకు ఈ బుల్లెట్టు అందుబాటులో ఉండటం కలవరపరిచే అంశమే.

More Telugu News