loksabha: లోక్ సభలో జై శ్రీరామ్, అల్లాహు అక్బర్ నినాదాలు.. దీటుగా జవాబు ఇచ్చిన కాంగ్రెస్ నేత!

  • ఒవైసీ ప్రమాణం సందర్భంగా ఘటన
  • లోక్ సభలో స్పందించిన అధిర్ చౌదరి
  • అన్నిమతాల్లో దైవత్వం, మానవత్వం చూడాలని హితవు

మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల లోక్ సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తుండగా, బీజేపీ సభ్యులు జై శ్రీరామ్, వందేమాతరం నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మరికొందరు లోక్ సభ సభ్యులు పోటీగా అల్లాహు అక్బర్ అని నినాదాలు ఇచ్చారు. దీంతో లోక్ సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఈ నినాదాలపై ఘాటుగా స్పందించారు.

ఈరోజు లోక్ సభ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఎప్పుడైతే మసీదులో ముల్లాకు రాముడు కనిపిస్తాడో, ఎప్పుడయితే ఆలయంలో పూజారికి రహీమ్ కనిపిస్తాడో, ఎప్పుడయితే మనిషికి తోటి మనిషిలో మనిషి కనిపిస్తాడో అప్పుడు ఈ ప్రపంచపు ముఖచిత్రమే మారిపోతుంది’ అని వ్యాఖ్యానించారు. అన్ని మతాల్లో దైవత్వాన్ని, మనుషుల్లో మానవత్వాన్ని చూడాలని చౌదరి పరోక్షంగా హితవు పలికారు. కాగా అధిర్ వ్యాఖ్యలపై కొందరు లోక్ సభ సభ్యులు బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేశారు.

More Telugu News