Andhra Pradesh: అనంతపురంలో టీడీపీ నేత చంద్రశేఖర్ కు చెందిన తోట నరికివేత!

  • చిన్నమల్లేపల్లిలో చీనీతోట సాగుచేస్తున్న చంద్రశేఖర్
  • చెట్లను నరికివేసిన గుర్తుతెలియని దుండగులు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి
అనంతపురం జిల్లాలోని పుట్లూరులో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి చిన్నమల్లేపల్లికి చెందిన టీడీపీ నేత చంద్రశేఖర్ నాయుడుకు చెందిన చీనీ తోటలను గుర్తుతెలియని దుండగులు నరికేశారు. ఆయన 3 ఎకరాల్లో 300 చెట్లను సాగు చేశారు. వీటిలో 70 చెట్లను నరికివేశారు. దీంతో చంద్రశేఖర్ నాయుడు పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, యామినీబాల, తదితరులు ఘటనాస్థలికి సందర్శించారు.

ఈ విషయమై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. దాదాపు పదేళ్ల కిందట ఇలాంటి సంస్కృతి ఉండేదని తెలిపారు. ఇప్పటికైనా ఇలాంటి పద్ధతులను వదిలేయాలని సూచించారు. తమ కార్యకర్తలకు చెందిన తోటలు, ఆస్తులను ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ కిరణ్ కుమార్ రెడ్డితో ఫోన్ మాట్లాడిన జేసీ.. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. కాగా, లక్షలు పోసి కన్నబిడ్డల్లా సాగుచేసిన చెట్లను నరికివేశారని టీడీపీ నేత చంద్రశేఖర్ నాయుడు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Andhra Pradesh
Anantapur District
Telugudesam
attack
chini garden
Police

More Telugu News