Anil Ambani: హారతి కర్పూరమైన అనిల్ అంబానీ ఆస్తి... ఇక బిలియనీర్ కాదు!

  • 2008లో 42 బి. డాలర్లతో ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద ధనవంతుడు
  • 11 ఏళ్లలో 0.5 బి.డాలర్లకు పడిపోయిన ఆస్తి
  • ఇంకా చెల్లించాల్సిన రుణాల మొత్తం రూ. 1.70 లక్షల కోట్లు

అది 2008లో ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ బిలియనీర్ల జాబితా. తన తండ్రి దీరూభాయ్ అంబానీ ఆస్తులను ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు పంచుకున్న తరువాత, అడాగ్‌ గ్రూపు అధినేతగా నిలిచిన అనిల్‌ అంబానీ ఆ సమయంలో 42 బిలియన్ డాలర్ల ఆస్తులతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల లిస్ట్ లో 6వ స్థానంలో ఉన్నారు. ఆపై 11 సంవత్సరాలు గడిచేసరికి ఆయన ఆస్తి విలువ దారుణంగా పడిపోయింది. ఎంతగా అంటే, ఇప్పుడాయన ఆస్తి కనీసం బిలియన్ డాలర్లు కూడా లేదు. అంబానీ మొత్తం వ్యాపార సామ్రాజ్యం విలువ ప్రస్తుతం కేవలం రూ. 3,651 కోట్లు (523 మిలియన్ డాలర్లు) మాత్రమే.

అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ సంస్థలన్నీ నష్టాల్లో కూరుకుపోవడం, అప్పులు పెరగడంతో ఆయన వ్యాపార సామ్రాజ్యం విలువ పాతాళానికి చేరింది. మ్యూచువల్‌ ఫండ్‌ జాయింట్‌ వెంచర్‌ అయిన, రిలయన్స్‌ - నిప్సాన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌ మెంట్‌ లోని తమ 43 శాతం వాటాలను విక్రయించాలని బ్యాంకులు నిర్ణయించుకోవడం, గడచిన 14 నెలల కాలంలో రూ. 35 వేల కోట్లకు పైగా రుణాలను తీర్చడంతోనే అనిల్ అంబానీ ఆస్తి హారతికర్పూరమైంది.

కాగా, అడాగ్ దీరూభాయ్ అంబానీ గ్రూప్ సంస్థల విలువ గడచిన ఫిబ్రవరిలో రూ. 8 వేల కోట్లకు పైగానే ఉండటం గమనార్హం. ఈ నాలుగు నెలల వ్యవధిలో సంస్థ ఈక్విటీలను కొనేవారు లేకపోగా, జోరుగా విక్రయాలు సాగాయి. గత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి అనిల్ అంబానీ చెల్లించాల్సిన రుణాల విలువ రూ. 1.70 లక్షల కోట్లకు పైగా ఉండటం గమనార్హం.

More Telugu News