Gummanur Jayaram: జగన్ నాకు మంత్రి పదవి ఇవ్వడానికి కారణం అదే: గుమ్మనూరు జయరాం

  • రూ.50 కోట్లు, మంత్రి పదవి ఇస్తామన్నారు
  • ఆ ఆఫర్ నా వెంట్రుకతో సమానం అని చెప్పాను
  • భూమా నాగిరెడ్డి లాంటి వాళ్లు డబ్బుకు అమ్ముడుపోయారు
ఎవరూ ఊహించని రీతిలో మంత్రి పదవి దక్కించుకున్న వైసీపీ ఎమ్మెల్యేల్లో గుమ్మనూరు జయరాం ఒకరు. ఎన్నికల్లో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి ఆయన ఘనవిజయం సాధించారు. జయరాంకు రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల మంత్రిత్వ శాఖను కేటాయించారు. ప్రస్తుతం జయరాం మంత్రి హోదాలో తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కీలక వ్యాఖ్యలు చేశారు.

గతంలో తనకు రూ.50 కోట్ల నగదుతోపాటు మంత్రి పదవి కూడా ఇస్తానని చంద్రబాబు నుంచి ఆఫర్ వచ్చిందని, అయితే దాన్ని తాను తిరస్కరించానని వెల్లడించారు. ఆ ఆఫర్ తన వెంట్రుకతో సమానం అని భావించి తిప్పి పంపానని జయరాం గర్వంగా చెప్పారు. కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి వంటి నేతలు డబ్బుకు అమ్ముడుపోయారని ఆరోపించారు.

డబ్బుకు అమ్ముడుపోకుండా ఆనాడు నిజాయతీగా నిలిచినందుకే జగన్ ఈరోజున మంత్రి పదవి ఇచ్చారని వివరించారు. ఆ సమయంలో తాను నీతిగా వ్యవహరించినందువల్ల తన సామాజిక వర్గమైన బోయలకు కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీసం మెలేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.
Gummanur Jayaram
YSRCP
Jagan

More Telugu News