India: అసహనం, ఉక్రోషం, బాధ... పాక్ క్రికెట్ టీమ్ పై ఫ్యాన్స్ కామెంట్లివి!

  • సామాజిక మాధ్యమాల్లో పేలుతున్న తూటాలు
  • సర్ఫరాజ్ ను ఏకిపారేస్తున్న నెటిజన్లు
  • వరుణుడిపై నెపం మోపుతున్న వీరాభిమానులు
నిన్న రాత్రి మాంచెస్టర్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ పోటీలో పాకిస్థాన్ జట్టుపై భారత్ 89 పరుగుల తేడాతో (డీ/ఎల్) విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే పాక్ ఓటమి ఖాయంకాగా, జట్టు సభ్యులపై, ముఖ్యంగా కెప్టెన్ సర్పరాజ్‌ అహ్మద్ పై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి.

ముఖ్యంగా ఓటమిని జీర్ణించుకోలేని పాక్ అభిమానులు, సర్పరాజ్‌ ను ఏకేశారు. అతని ఆటతీరు పేలవమని ఎగతాళి చేశారు. "గుడ్ నైట్ బాయ్స్... అద్భుతమైన టీ కప్పుతో నన్ను నిద్ర లేపండి" అని ఒకరు చురకలు అంటించగా, అసలు సర్ఫరాజ్ బ్యాట్ ఎందుకు పట్టుకున్నాడని ఇంకొకరు ప్రశ్నించారు. పలువురు కన్నీరు పెడుతూ, ఈ మ్యాచ్ చూడటం కష్టమని, విజయం సులువుకాదని తెలిసినా వచ్చామని, పాక్ ఆటతీరు ఎంతో బాధను కలిగించిందని అన్నారు.

ప్రస్తుతం ఇండియా చాలా గొప్ప జట్టని, అటువంటి జట్టును ఇలాంటి ఆటతీరుతో గెలవడం కష్టమని అన్నారు. కనీసం పోరాడకుండా కీలకమైన ఆటగాళ్లు పెవిలియన్ కు రావడాన్ని తట్టుకోలేకున్నామని వాపోయారు. కోహ్లీ ఒక్కడే 41 సెంచరీలు చేస్తే, తమ ఆటగాళ్లంతా కలిసి 41 సెంచరీలు చేశారని, ఇరు జట్ల బలాబలాలను బేరీజు వేసేందుకు ఇదొక్క ఉదాహరణే చాలని కొందరు సర్దిచెప్పుకున్నారు. మరి కొందరు వీరాభిమానులు మాత్రం వరుణుడు తమ ఆశలను తుడిచి పెట్టేశాడని అనడం గమనార్హం.
India
Pakistan
Cricket
Fans
Social Media

More Telugu News