New delhi: దేశానికి, ప్రజాప్రయోజనాలకు ఉపయోగపడే అంశాలపై మద్దతు ఇస్తాం: ఎంపీ విజయసాయిరెడ్డి

  • చాలా సమయం వృథా అవుతోంది
  • సభలు సజావుగా సాగేలా చట్టం తీసుకురావాలి
  • మేము లేవనెత్తిన అంశాలకు ఇతర పార్టీలు మద్దతిచ్చాయి

కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలన్న విషయాన్ని ప్రస్తావించినట్టు ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్ లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్ సమావేశాల్లో చర్చల సందర్భంగా సభ్యులు సృష్టించే అంతరాయం వల్ల చాలా సమయం వృథా అవుతోందని, అలా కాకుండా సభలు సజావుగా సాగేలా చట్టం తీసుకురావాలని కోరినట్టు చెప్పారు. ఎవరైతే సమావేశాలకు హాజరుకారో, సమావేశాలకు ఆటంకం కల్గిస్తారో వారికి ఎటువంటి జీతభత్యాలు సహా మిగతా ప్రయోజనాలు కల్గకుండా చూడాలన్న అంశాన్నీ ప్రధాని దృష్టికి తీసుకొచ్చినట్టు చెప్పారు. వైసీపీ లేవనెత్తిన అంశాలకు ఇతర పార్టీలు మద్దతు తెలిపాయని అన్నారు. దేశానికి, ప్రజాప్రయోజనాలకు ఉపయోగపడే అంశాలపై మద్దతు ఇస్తామని తెలిపారు.

ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ప్రతి అంశాన్ని వైసీపీ సమర్థిస్తుంది: మిథున్ రెడ్డి

రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే అన్ని బిల్లులకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ప్రతి అంశాన్ని వైసీపీ సమర్థిస్తుందని చెప్పారు. నాడు యూపీఏ, ఎన్డీఏలు కలిసి తమ రాష్ట్రాన్ని విభజించారని, ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చే బాధ్యత అందరిపైనా ఉందని అఖిలపక్ష సమావేశం దృష్టికి విజయసాయిరెడ్డి తీసుకెళ్లారని చెప్పారు.

More Telugu News