Andhra Pradesh: చంద్రబాబుకు తనిఖీలపై టీడీపీ ఆగ్రహం.. విశాఖలో అర్ధనగ్నంగా నిరసనకు దిగిన ఎమ్మెల్యేలు!

  • గన్నవరంలో చంద్రబాబుకు తనిఖీలు
  • మండిపడ్డ టీడీపీ శ్రేణులు, నేతలు
  • మావోల నుంచి ముప్పు ఉందని వ్యాఖ్య
  • భద్రతను కట్టుదిట్టం చేయాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును గన్నవరం విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు, అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ విశాఖ నేతలు అందోళనకు దిగారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేశ్ కుమార్, వెలగపూడి రామకృష్ణ బాబులు టీడీపీ కార్యకర్తలతో కలిసి అర్ధనగ్నంగా నిరసన ప్రదర్శన చేపట్టారు.

ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే గణేశ్ కుమార్ మాట్లాడుతూ.. జగన్ పాదయాత్ర చేసినప్పుడు టీడీపీ ప్రభుత్వం పూర్తి భద్రతను కల్పించిందని గుర్తుచేశారు. చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉందనీ, ఆయనకు మావోయిస్టుల నుంచి ప్రమాదం ఉందని గుర్తుచేశారు. ఇప్పటికే వైసీపీ నేతలు ఐదుగురు టీడీపీ కార్యకర్తలను చంపారని ఆరోపించారు.

చంద్రబాబు భారత రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తి అనీ, ఆయన భారత ఆస్తి అని మరో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అన్నారు. కాబట్టి చంద్రబాబును కాపాడుకోవాల్సిన బాధ్యత దేశం, రాష్ట్రంపై ఉందని చెప్పారు. చంద్రబాబుకు ఏమైనా జరిగి ఉంటే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ఇప్పటికైనా చంద్రబాబుకు భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కాన్వాయ్ కు ఇప్పటికే పైలెట్ వాహనాన్ని, ఎస్కార్ట్ కారును ఏపీ ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే.

More Telugu News