Vishal: విశాల్... నీచమైన వీడియోలతో ఇంత దిగజారుతావని అనుకోలేదు: వరలక్ష్మి ఫైర్

  • మరికొన్ని రోజుల్లో నడిగర్ సంఘం ఎన్నికలు
  • శరత్ కుమార్ పై విశాల్ ఆరోపణలు
  • మండిపడిన వరలక్ష్మి
ఒకప్పుడు హీరో విశాల్, తమిళ నటి వరలక్ష్మి మధ్య ప్రేమాయణం ఉందని దక్షిణాది చిత్రపరిశ్రమ వర్గాలు కోడైకూశాయి. అయితే, పరిస్థితులు మనుషుల మధ్య ఎలాంటి మార్పులైనా తీసుకువస్తాయని చెప్పడానికి విశాల్, వరలక్ష్మి మధ్య తాజా విభేదాలే నిదర్శనం. విశాల్ 2019 కోలీవుడ్ నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఈ నెల 23న ఎన్నికలు జరగనుండగా, హీరో విశాల్ పై వరలక్ష్మి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

తన తండ్రి శరత్ కుమార్ పై విశాల్ నీచమైన ఆరోపణలు చేశాడంటూ మండిపడింది. "నా తండ్రి గతం గురించి అసత్యాలు ప్రచారం చేస్తావా? ఆ నీచమైన వీడియోలు నీ దిగజారుడుతనాన్ని నిరూపిస్తున్నాయి. నువ్వు పెరిగిన వాతావరణం అలాంటిది. అయినా మా నాన్నపై ఉన్న భూవివాదంపై ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. కోర్టు నిర్ణయం వచ్చేవరకు ఆయన దోషి కాదు. అలాంటప్పుడు నువ్వెలా ఆయన్ని దూషిస్తావు? ఓ వీడియోలో నీ మాటలు విన్న తర్వాత ఇప్పటివరకు నీపై ఉన్న గౌరవం కూడా పోయింది.

ఒకప్పుడు నీకోసం ఏమైనా చేయడానికి సిద్ధపడ్డాను. ఇవాళ నువ్వు హద్దులు దాటావు. ఓ మునిలా నటించాలని చూడకు. నీ నిజస్వరూపం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నీ గొప్పతనం ఏమైనా ఉంటే దాన్ని ప్రచారం చేసుకో. మా నాన్నపై దుష్ర్పచారం చేయడం ఎందుకు? నువ్వు మంచివాడివైతే నీ ప్యానెల్ సభ్యులే నిన్నెందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇకనైనా కాస్త హుందాగా ప్రవర్తించు. నువ్వు నా ఓటును కోల్పోయావు విశాల్" అంటూ వరలక్ష్మి ఘాటైన పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ 'పాండవర్' ప్యానెల్, భాగ్యరాజా 'స్వామి శంకర్ దాస్' ప్యానెల్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
Vishal
Varalaxmi

More Telugu News