Telangana: కేసీఆర్ లాంటి పొలిటికల్ టెర్రరిస్ట్ పై నా పోరాటం కొనసాగుతోంది: భట్టి విక్రమార్క

  • టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీన ప్రయత్నం దారుణం
  • ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచారు
  • కేసీఆర్ ఎక్కడో దాక్కుని ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీ-కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ,తాను చేసిన నిరాహార దీక్షకు మద్దతు ఇచ్చిన వారందరికీ తన కృతఙ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనానికి ప్రయత్నించడం ద్వారా ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచారని మండిపడ్డారు. కేసీఆర్ లాంటి పొలిటికల్ టెర్రరిస్టుపై తన పోరాటం కొనసాగుతుందని అన్నారు. కేసీఆర్ ఎక్కడో దాక్కుని ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని, ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ను బయటకు ఎలా రప్పించాలో తమకు తెలుసని వ్యాఖ్యానించారు.

ఫిరాయింపులకు సంబంధించి రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ను పూర్తిగా విస్మరిస్తున్నారని, దీనిపై కేసీఆర్ ఎక్కడ చర్చ పెట్టినా వచ్చేందుకు తాను సిద్ధమని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ లాగా తాము డ్రామాలు ఆడమని, ఫిరాయింపులు ఆపకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని అభిప్రాయపడ్డారు. ‘కాంగ్రెస్’లో నాయకత్వం లోపించిందని పార్టీ ఫిరాయింపుదారులు మాట్లాడటం తగదని, వాళ్లు చెప్పింది నిజమే అయితే, ‘బీ ఫామ్’ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. 

More Telugu News