Hyderabad: మంచు మనోజ్ ట్వీట్ కు స్పందించిన కేటీఆర్

  • వేడినీళ్లు పైనపడడంతో బాలుడికి తీవ్రగాయాలు
  • తల్లిదండ్రుల దీనస్థితికి చలించిపోయిన మంచు మనోజ్
  • కేటీఆర్ కు ట్వీట్

సామాజిక మాధ్యమాల్లో ఎంతో క్రియాశీలకంగా ఉండే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సినీ నటుడు మంచు మనోజ్ చేసిన ట్వీట్ కు వెంటనే స్పందించారు. ఆల్వాల్ కు చెందిన నాలుగేళ్ల బాలుడు వేడినీళ్లు పడి కాలిన గాయాలతో ఆసుపత్రిపాలవడంతో అతడి తల్లిదండ్రులు ఆర్థికసాయం కోసం దాతలను అర్థించారు. ఈ విషయం తెలిసిన మంచు మనోజ్ టీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ కు ట్వీట్ చేశారు. తాను కూడా సాయం చేశానని, కానీ, మరికొందరు కూడా సాయం చేస్తే ఆ బాలుడి చికిత్సకయ్యే ఖర్చుల భారం తగ్గుతుందని మంచు మనోజ్ విజ్ఞప్తి చేశారు.

దీనిపై స్పందించిన కేటీఆర్, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వుల ప్రతిని కూడా తన ట్వీట్ లో పొందుపరిచారు. ఈటీవీలో పనిచేసే నరేశ్ ఠాకూర్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఆల్వాల్ లో ఉంటున్నాడు. అతని కుమారుడు కృషీవ్ ఠాకూర్ గత నెల 31వ తేదీన ఆడుకుంటూ వెళ్లి వేడినీళ్లులో పడ్డాడు. దాంతో తీవ్రగాయాలయ్యాయి. అప్పటినుంచి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తమ వద్ద ఉన్న డబ్బు అయిపోవడంతో నరేశ్ ఠాకూర్ దాతల కోసం అర్థించడం మంచు మనోజ్ ను కదిలించింది. ఇప్పుడాయన ట్వీట్ చేయడంతో కేటీఆర్ వెంటనే స్పందించి సీఎంఆర్ఎఫ్ కింద రూ.2 లక్షలు విడుదల చేసినట్టు వెల్లడించారు.

More Telugu News