Jagan: సభలో ఆ దుస్థితిని మరోసారి రానివ్వబోను: అసెంబ్లీలో జగన్ తొలి ప్రసంగం

  • గత శాసనసభపై జగన్ విసుర్లు
  • బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని చూపిస్తాం
  • విశ్వసనీయతకు కేరాఫ్ అడ్రస్ గా ప్రభుత్వం ఉంటుంది
  • ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ ఉదయం స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైన తరువాత వైఎస్ జగన్, ముఖ్యమంత్రి హోదాలో ఆయన్ను అభినందిస్తూ, తొలిసారిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రం విడిపోయిన తరువాత ఏర్పడిన తొలి సభలో పరిస్థితులను ఆయన గుర్తు చేశారు. తమ పార్టీ గుర్తుపై గెలిచిన 23 మందిని గత ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా తమ పార్టీలో చేర్చుకోవడంతో పాటు నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిందని నిప్పులు చెరిగారు. అటువంటి దుర్మార్గమైన పరిస్థితిని మరోసారి సభలో రానివ్వబోనని అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుంటే, తాము సభలోకి రాబోమని స్పష్టంగా చెప్పినా పట్టించుకోలేదని దుయ్యబట్టారు.

బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని ఈ చట్ట సభలో మళ్లీ చూపిస్తానని జగన్ స్పష్టం చేశారు. టెండర్ల వ్యవస్థలోనూ, గ్రామస్థాయిలోనూ, ప్రభుత్వ యంత్రాంగంలోను అవినీతిని తొలగించి, విలువలు, విశ్వసనీయతకు రాష్ట్రాన్ని కేరాఫ్ అడ్రస్ గా చేసి చూపిస్తానని అన్నారు. అందుకు తమ ప్రభుత్వం తొలి రోజు నుంచి అన్ని ప్రయత్నాలూ చేస్తోందని, అందులో భాగంగానే నిజాయతీగల తమ్మినేనిని స్పీకర్ గా ప్రకటించామని జగన్ తెలిపారు. ఓ స్పీకర్, ఓ లీడర్ ఆఫ్ ది హౌస్ ఎలా ఉండకూడదో, గత శాసనసభను చూస్తే అర్థం అయిందని, ఎలా ఉండాలో చెప్పడానికి ఈ శాసనసభ, ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందని అన్నారు.

More Telugu News