Kodela sivaprasad: నేను స్పీకర్ పదవికి కళంకం తెచ్చానా?: విజయసాయిపై కోడెల ఫైర్

  • నా కుటుంబ సభ్యులపై ఏడెనిమిది కేసులు పెట్టారు
  • విజయసాయి ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది
  • ఆయన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి తనపై చేసిన విమర్శలపై ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఈ రోజు ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి, స్పందించారు. స్పీకర్‌గా తాను అసెంబ్లీ ప్రతిష్ఠను దిగజార్చానని ఆయన ట్వీట్ చేశారని, తమ కుటుంబ సభ్యులపై కేసులు పెట్టాలంటూ రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడారని అన్నారు. ఈ ఆరోపణలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే ఈ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తాను తొలి స్పీకర్‌గా వ్యవహరించినందుకు గర్వంగా ఉందన్న కోడెల.. తనను అధికార ప్రతిపక్ష నాయకులు ఏకగ్రీవంగా ఆ పదవిలో కూర్చోబెట్టినట్టు చెప్పారు. స్పీకర్‌గా తానెప్పుడూ తప్పుడు పనులు చేయలేదన్నారు. అందరికీ అవకాశం ఇచ్చానని, కొత్త శాసనసభ కావడంతో అవగాహన సదస్సులు కూడా నిర్వహించినట్టు చెప్పారు.

తన కుటుంబ సభ్యులపై ఇప్పటి వరకు ఏడెనిమిది కేసులు పెట్టారని, ఈ రోజు కూడా రెండుమూడు కేసులు పెట్టినట్టు తెలిసిందన్నారు. వారు ఎన్ని కేసులు పెడతారో, ఎంత వరకు పెడతారో తనకు తెలియదన్నారు. తన కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రారని, వారి పనులు వారు చేసుకుంటున్నారని ఎన్నోసార్లు చెప్పానని కోడెల గుర్తు చేశారు. అటువంటిది వారిపై కేసులు పెట్టుకుంటూ పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయసాయి రెడ్డి ట్వీట్ తప్పుడు కేసులు పెట్టాలని ప్రోత్సహించేలా ఉందని కోడెల పేర్కొన్నారు.

More Telugu News