Ravi Prakash: రవిప్రకాశ్ కేసు విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన హైకోర్టు

  • క్రిమినల్ కేసు ఎలా పెడతారు?
  • సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం తగదు
  • పోలీసులు చట్ట పరిధి దాటి వ్యవహరిస్తున్నారంటూ వాదించిన రవిప్రకాశ్ తరఫు న్యాయవాది 

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌కు సంబంధించిన కేసును హైకోర్టు వాయిదా వేసింది. పోలీసులు చట్ట పరిధి దాటి వ్యవహరిస్తున్నారని, సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడం మంచిది కాదని రవిప్రకాశ్ తరుఫు న్యాయవాది దిల్జీత్ సింగ్ అహ్లువాలియా వాదించారు.

ఎన్‌సీఎల్‌టీలో విచారణ పెండింగ్‌లో ఉండగా, క్రిమినల్ కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. కుట్రతోనే రవిప్రకాశ్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే కట్టుకథల్ని, రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేయాలనే అల్లుతున్నారని అహ్లువాలియా వాదించారు. కాపీరైట్ చట్టం ప్రకారం టీవీ9 లోగోపై రవిప్రకాశ్‌కే హక్కులుంటాయని వాదించారు.

మరోవైపు రవిప్రకాశ్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని హైకోర్టును పోలీసులు కోరారు. ఆయన సాక్షులను, దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులు కోర్టుకు అందజేశారు. రవిప్రకాశ్ పలువురు సాక్షులతో చాటింగ్ చేశారంటూ మొబైల్ స్క్రీన్ షాట్లను న్యాయస్థానానికి సమర్పించారు.

టీవీ9 లోగోను అమ్ముకునేందుకు రవిప్రకాశ్ యత్నించారని, దాని యజమానిని తానేనని చెబుతున్నారని పోలీసులు న్యాయస్థానానికి వివరించారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ, సుప్రీంకోర్టు ఆదేశాలతో వెళ్లినప్పటికీ రవిప్రకాశ్ కోర్టుకు సహకరించడం లేదని తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు కేసు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

More Telugu News