Cricket: సౌతాంప్టన్ లో వర్షం.. నిలిచిపోయిన దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మ్యాచ్

  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్
  • దక్షిణాఫ్రికా స్కోరు 2 వికెట్లకు 29 పరుగులు
  • రెండు వికెట్లు తీసిన కాట్రెల్

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో వరుణుడి హవా కొనసాగుతోంది. ఇవాళ దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య సౌతాంప్టన్ లో జరుగుతున్న మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. వాతావరణం చల్లగా ఉన్న నేపథ్యంలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ పిచ్ పరిస్థితులను సద్వినియోగపర్చుకుంది.

విండీస్ లెఫ్టార్మ్ పేసర్ షెల్డన్ కాట్రెల్ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఆమ్లా పేలవ ఫామ్ కొనసాగిస్తూ 6 పరుగులకే వెనుదిరిగాడు. వన్ డౌన్ లో వచ్చిన ఐడెన్ మర్క్రామ్ (5) కూడా సింగిల్ డిజిట్ స్కోరుతో సరిపెట్టుకున్నాడు. ఈ రెండు వికెట్లు కాట్రెల్ కు దక్కాయి. క్రీజులో కెప్టెన్ డుప్లెసిస్ (0), ఓపెనర్ డికాక్ (17) ఉన్నారు.

అయితే, ఎనిమిదో ఓవర్ లో 3 బంతులు మిగిలున్న సమయంలో వర్షం పడడంతో మ్యాచ్ నిలిచిపోయింది. అప్పటికి దక్షిణాఫ్రికా స్కోరు 2 వికెట్లకు 29 పరుగులు. కడపటి వార్తలు అందే సమయానికి కూడా వర్షం తగ్గకపోగా, మైదానంలో కప్పిన కవర్లను అలాగే ఉంచారు.

More Telugu News