Andhra Pradesh: అసభ్య వ్యాఖ్యలతో నా పేరిట ఫేక్ పోస్టింగ్స్ చేస్తున్నారు: టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని

  • ఏపీ పోలీసులకు యామిని ఫిర్యాదు
  • మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి వెళ్లిన యామిని
  • ‘ఫేస్ బుక్’ లో తన పేరిట ఫేక్ అకౌంట్స్ సృఫ్టించారని ఫిర్యాదు

తన పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు తెరిచి అసభ్యకరమైన పోస్టింగ్స్ చేస్తున్నారని ఏపీ పోలీసులకు టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి ఈరోజు ఆమె వెళ్లారు. ఉమెన్ ప్రొటెక్షన్ ఎస్పీ సరితకు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు తనకు అర్ధరాత్రి ఫోన్ కాల్స్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని, తనతో పాటు తన కుటుంబసభ్యులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని తన ఫిర్యాదులో ఆరోపించారు.

ఈ సందర్భంగా యామినిని పలకరించిన మీడియాతో ఆమె మాట్లాడుతూ, తన ఫేస్ బుక్ అధికారిక పేజీ సాధినేని యామినీ శర్మ పేరిట ఉందని చెప్పారు. ఇది కాకుండా, ‘యామిని సాధినేని’, ‘యామిని సాధినేని యువసేన’.. ఇలా ‘ఫేస్ బుక్’ లో ఫేక్ అకౌంట్స్ ను సృఫ్టించి చాలా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ, సీఎం జగన్, ఇతర నాయకులపై అసభ్య పదాలు వాడుతూ తాను చేసినట్టుగా ఈ పోస్టింగ్స్ పెడుతున్నారని ఆరోపించారు. ఈ పోస్ట్ లను నిజంగా తానే చేశానని నెటిజన్లు భావిస్తూ విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారని అన్నారు.

ఇలాంటి పోస్ట్ ల వల్ల తనకు, తన కుటుంబానికి, పార్టీ ప్రతిష్టకు, గౌరవానికి భంగం వాటిల్లుతోందని చెప్పారు. తన పేరిట ఉన్న ఫేక్ అకౌంట్స్ ను వెంటనే తొలగించాలని, సైబర్ చట్టాన్ని మరింత కఠినతరం చేసి.. రాజకీయాల్లో ఉన్న ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు మరింత భరోసా కల్పించాలని సీఎం జగన్ ని, డీజీపీని కోరుతున్నానని చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం ఎక్కువై పోయిందని, అసభ్యకర పదజాలం ఉపయోగిస్తూ దుర్భాషలాడుతున్నారని యామిని ఆరోపించారు.

రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకు, దేశ, విదేశాల్లో తనకు ఉన్న పేరుప్రతిష్టలను దెబ్బతీయాలన్న దురుద్దేశంతోనే ఇలాంటి పోస్టింగ్స్ తన పేరిట పెడుతున్నారని ఆరోపించారు. మానసికంగా తనను దెబ్బతీసి రాజకీయాలకు తనను దూరం చేయాలని చూస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి ఫేక్ పోస్ట్ లకు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని యామిని స్పష్టం చేశారు. గతంలో కూడా తన పేరును ఉపయోగించి ఇలాంటి ఫేక్ పోస్టింగ్స్ వచ్చాయని, మళ్లీ ఇప్పుడు ఈవిధంగా జరిగిందని అన్నారు. ఈ వ్యవహారం గురించి తమ అధినేత చంద్రబాబునాయుడుకి గతంలో చెప్పానని, మరొక్కసారి మళ్లీ ఆయన్ని కలిసి జరిగిన విషయాన్ని వివరిస్తానని యామిని పేర్కొన్నారు.

More Telugu News