Road Accident: మూడు రోజుల క్రితమే ద్విచక్ర వాహనం కొనుగోలు.. ఇంతలోనే ప్రమాదం జరిగి మృత్యువాత

  • స్నేహితుల విషాదాంతం ఇది
  • మెట్రో రైల్‌ పిల్లర్ ను ఢీకొట్టడంతో దుర్ఘటన
  • ఒకరు సంఘటనా స్థలంలో, మరొకరు ఆసుపత్రిలో మృతి

నూతన ద్విచక్ర వాహనం కొని ముచ్చటగా మూడు రోజులే అయింది. వాహనం కొనుక్కున్న ఆనందం తీరక ముందే మృత్యువు తన కౌగిట బంధించింది. అతివేగంగా వెళ్లి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో స్నేహితుల విషాదాంతమిది. పోలీసుల కథనం మేరకు హైదరాబాద్, సరూర్‌నగర్‌లోని భగత్‌సింగ్‌నగర్‌లో ఉండే గాదె సంజయ్‌ (20), ఎల్పీనగర్‌లోని మన్సూరాబాద్‌కు చెందిన జగదీప్ (19) స్నేహితులు. సంజయ్‌ ఐటీఐ చేయగా, జగదీష్‌ ఇంటర్‌  ఫెయిలయ్యాడు.

తనకు బండి కొనివ్వాల్సిందిగా సంజయ్ తల్లిపై ఒత్తిడి తెచ్చి మరీ మూడు రోజు క్రితం కొత్తబండి తెచ్చుకున్నాడు. శనివారం అర్ధరాత్రి సంజయ్‌ డ్రైవ్‌ చేస్తుండగా, జగదీప్ వెనుక కూర్చుని బండిపై ఎల్పీనగర్‌ నుంచి ఉప్పల్‌ వైపు బయలు దేరారు. అతివేగం వల్ల వాహనం అదుపుతప్పి ఉప్పల్‌లోని మెట్రో రైల్వేస్టేషన్‌ ప్రాంతంలోని 817 నంబర్‌ పిల్లర్‌ను ఢీకొట్టి కిందపడిపోయింది.

ఈ ప్రమాదంలో సంజయ్‌ అక్కడికక్కడే చనిపోగా జగదీష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. సంజయ్‌ తండ్రి దుర్గయ్య ఇటీవలే మృతి చెందాడు. ఆ విషాదం నుంచి తేరుకోక ముందే కొడుకు కూడా చనిపోవడంతో ఆ తల్లి రోదన వర్ణనాతీతం. బిడ్డ ప్రాణాలు తీసేందుకే బండి కొనిచ్చానా అంటూ ఆమె భోరుమంది.

  • Loading...

More Telugu News