England: జోఫ్రా అర్చర్ మ్యాజిక్.. విచిత్రంగా అవుటైన బంగ్లా ఆటగాడు!

  • ఆఫ్ స్టంప్‌ను గిరాటేసి సిక్స్ వెళ్లిన బంతి
  • మైదానంలో అయోమయం
  • బంగ్లాదేశ్‌ను చిత్తుచేసిన ఆతిథ్య జట్టు

ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్-బంగ్లాదేశ్ మధ్య కార్డిఫ్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఓ విచిత్రం జరిగింది. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా అర్చర్ వేసిన నాలుగో ఓవర్ రెండో బంతికి బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే, విచిత్రంగా బంతి మాత్రం బౌండరీ దాటడం విశేషం. 143 కిలోమీటర్ల వేగంతో అర్చర్ సంధించిన బంతి ఆఫ్ స్టంప్‌ను గిరాటేస్తూ ఏకంగా బౌండరీలైన్‌కు ఆవల పడింది. ఒక్క బౌన్స్ కూడా లేకుండా నేరుగా వెళ్లి బౌండరీలైన్‌కు ఆవల పడడంతో ప్రేక్షకులు, కామెంటేటర్లు తొలుత ఆశ్చర్యపోయారు. బంతి సిక్స్ అయితే అర్చర్ ఎందుకు సంబరాలు చేసుకుంటున్నాడో అర్థం కాలేదు. ప్రేక్షకులు కూడా అదే అయోమయానికి లోనయ్యారు. అయితే, టీవీ రీప్లేలో బంతి ఆఫ్ స్టంప్‌ను గిరాటేయడం స్పష్టంగా కనిపించింది.

కాగా, ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బాగానే పోటీ ఇచ్చినప్పటికీ చివర్లో చేతులెత్తేయడంతో 106 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 280 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో జాసన్ రాయ్ (153), బంగ్లాదేశ్ ఆటగాళ్లలో షకీబల్ హసన్ (121) సెంచరీలు చేశారు.

More Telugu News